ఉచ్చ పెట్రోల్ అయ్యింది... మూత్రం పోసినందుకు బిల్లు 100,జీఎస్టీ 12 రూపాయలు
ఇద్దరు విదేశీయులు ఆగ్రా రైల్వే స్టేషన్ వాష్ రూం 5 నిమిషాలు ఉపయోగించినందుకు ఒక్కొక్కరు 112 రూపాయల చొప్పున 224 రూపాయలు కట్టాల్సి వచ్చింది. అందులోనూ 12 శాతం జీఎస్టీ కూడా.
ఘనత వహించిన నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎటు పోతోంది? అన్ని వస్తువుల రేట్లు ఆకాశాన్నంటుతూ ఉంటే వాటికి తోడు మాడు పగలగొట్టే జీఎస్టీ ఒకటి. చివరకు మూత్రం పోయాలన్నా జీఎస్టీ కట్టాల్సిన పరిస్థితి ఇక్కడ తప్ప ఇంకే దేశంలోనైనా ఉంటుందా ?
ఇక అసలు కథలోనికి వద్దాం....బ్రిటన్ నుండి ఇద్దరు యాత్రికులు భారత దేశాన్ని చూద్దామని వచ్చారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ నుండి గతిమాన్ ఎక్స్‌ప్రెస్ లో ఆగ్రా రైల్వే స్టేషన్ లో దిగారు. ఐసీ శ్రీవాస్తవ అనే స్థానిక గైడ్ వాళ్ళను రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరు గైడ్ ను వాష్ రూం కు వెళ్ళాలని అడగగా ఆయన వాళ్ళను స్టేషన్‌లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లోకి తీసుకెళ్లాడు. ఐదు నిమిషాల తర్వాత పని పూర్తి చేసుకొని వాళ్ళిద్దరూ బయటకు రాగానే రిసెప్షన్‌లో కూర్చున్న అమ్మాయి వాళ్ళ చేతిలో 240 రూపాయల బిల్లు పెట్టింది.
అందులో ఒక్కొక్కరికి 100 రూపాయలు బిల్లు, 12 రూపాయలు జీఎస్టీ అని ఉంది. వాష్‌రూమ్‌ను వాడుకున్నందుకు రూ.112 బిల్లు రావడంపై గైడ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కానీ, అక్కడ ఎవరూ అతని మాట వినలేదు.తప్పనిసరి పరిస్థితిలో, అతను అతిథులిద్దరికీ రూ.224 చెల్లించాల్సి వచ్చింది.
ఒకవైపు ప్రభుత్వం అతిథి దేవో భవ గురించి చెబుతూనే మరోవైపు నిబంధనల పేరుతో అతిథి నుంచి అనవసరంగా బిల్లు వసూలు చేస్తున్నారని గైడ్ శ్రీవాస్తవ వాపోయారు. దీనివల్ల భారత దేశమంటే పర్యాటకులకు తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని, అందుకే ఆ బిల్లు తానే కట్టానని చెప్పాడాయన . ఈ విషయమై టూరిజం శాఖలో కూడా ఫిర్యాదు చేస్తానని అంటున్నారు శ్రీవాస్తవ.
మరో వైపు IRCTC మాత్రం తాము చేసిన దాంట్లో తప్పేమీలేదంటోంది. జీఎస్టీ అనేది మాకు సంబంధించిన అంశంకాదు. అది ప్రభుత్వాన్ని అడగాలి అని IRCTC ప్రతినిధి బ్రజేష్ కుమార్ అన్నారు. ఇక 100 రూపాయల బిల్లుపై ఆయన మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లోకి ప్రవేశించడానికి రుసుము ఉంటుందని, లాంజ్ ను గంట వినియోగించుకున్నా ఐదు నిమిషాలు ఉపయోగించుకున్నా 200 రూపాయలు చార్జ్ అవుతుందని చెప్పాడు.
ఉచ్చ పెట్రోల్ అవడమని దీన్నే అంటారా ?