Telugu Global
National

ఈ మహిళా కమిషన్ చైర్ పర్సన్ చిన్నతనంలో తండ్రి లైంగిక వేధింపులను చవిచూశారు

మైనర్‌గా ఉన్న తనపై తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అప్పుడే మహిళల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ శనివారం వెల్లడించారు.

ఈ మహిళా కమిషన్ చైర్ పర్సన్ చిన్నతనంలో తండ్రి లైంగిక వేధింపులను చవిచూశారు
X

మనదేశంలో మహిళలపై, బాలికలపై లైంగిక వేధింపులు సర్వ సాధారణం. బైటి వ్య‌క్తుల నుండే కాకుండా దగ్గరి బంధువులు, స్నేహితులనుండి కూడా మహిళలు, ముఖ్యంగా బాలికలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. దగ్గరి బందువుల నుండి లైంగిక వేధింపులకు గురైన చాలా మంది పోలీసు స్టేషన్ దాకా కూడా రారు. కాబట్టి అటు వంటి సంఘటనలు ప్రపంచానికి తెలిసే అవకాశం కూడా లేదు.

ఇంకా దారుణంగా స్వంత తండ్రులే కూతుర్ల మీద లైంగిక వేధింపులకు పాలడిన సంఘటన‌లు కూడా జరుగుతున్నాయి. తల్లికి తెలిసినా కాపురం కూలిపోకుండా ఉండటం కోసం ఆమె నోరుమూసుకుని ఉండటంతో ఆ పసివాళ్ళ మానసిక పరిస్థితి అల్లకల్లోలం అవుతుంది. కొంత మంది పెద్దవాళ్ళయ్యాక వాటిని బైట పెట్టిన సందర్భాలున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు తనను చిన్నప్పుడు తన తండ్రి లైంగికంగా వేధించాడని చెపారు. ఇప్పుడు మరో ప్రముఖ నాయకురాలు తాను చిన్నప్పుడు తండ్రి నుంచి ఎదుర్కొన్న వేధింపులను ఏకరువు పెట్టారు.

మైనర్‌గా ఉన్న తనపై తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అప్పుడే మహిళల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ శనివారం వెల్లడించారు.

DCW అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల వేడుకలో ఆమె మాట్లాడుతూ, "నాపై మా నాన్న లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నేను చాలా చిన్నదానిగా ఉన్నప్పుడు మా నాన్న నన్ను కొట్టేవారు. నన్ను నేను రక్షించుకోవడానికి మంచం కింద దాక్కునేదాన్ని" అని మలివాల్ అన్నారు.

అనేక సార్లు తన‌ జుట్టు పట్టుకుని రక్తం వచ్చేలా తలను గోడకు కొట్టేవాడని ఆమె తెలిపారు.. తాను 4వ తరగతి వచ్చే వరకు ఇది కొనసాగిందని ఆమె గుర్తుచేసుకుంది. ఆ తర్వాత తన తండ్రి నుంచి తన తల్లి విడిపోయింది. ఆ ఇంటి నుంచి మేము బైటికి వచ్చేశాం అని స్వాతి చెప్పారు.

ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందేనని చిన్నతనంలోనే తాను నిర్ణయించుకున్నానని ఆమె అన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే ఇలాంటి మగవాళ్లకు గుణపాఠం చెప్పాలని, మహిళల హక్కులను సాధించేందుకు ఏదో ఒకటి చేయాలని మంచం కింద దాక్కున్నప్పుడు ఆలోచించేదాన్ని అని ఆమె అన్నారు.

First Published:  12 March 2023 9:10 AM IST
Next Story