Telugu Global
National

గ్యాస్ రేట్లు తగ్గించాలి.. వారియర్ మామ్స్ ఉద్యమం

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ కు లేఖలు రాశారు. గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గించాలన్నారు, అరకొరగా విదిలిస్తున్న సబ్సిడీ ఏమాత్రం సరిపోవట్లేదని అన్నారు.

గ్యాస్ రేట్లు తగ్గించాలి.. వారియర్ మామ్స్ ఉద్యమం
X

గ్యాస్ బండతో కేంద్రం సామాన్యుల్ని బాదిపడేస్తోంది. కాంగ్రెస్ హయాంలో రేట్లు స్వల్పంగా పెరిగేవి, ఇప్పుడు ఏకబిగిన పదులు, యాభైలు పెంచేస్తున్నారు. గృహ వినియోగదారుల సిలిండర్ ని 1100 రూపాయలకి చేర్చారు. నిజంగా ఇది సామాన్యులకు పెనుభారమే. కానీ కట్టెలపొయ్యి అలవాటు తప్పింది, ఆర్థిక స్థితి సహకరించకపోయినా వంటింట్లో గ్యాస్ తప్ప ఇంకేదీ ఉపయోగించలేని పరిస్థితి. అందుకే ఇతర బడ్జెట్ అవసరాలు తగ్గించుకున్నా, గ్యాస్ భారం మాత్రం మధ్యతరగతి మోయాల్సిందే. ఇలాంటి కష్టాలు తప్పించాలంటూ మాతృమూర్తులంతా ఓ ఉద్యమం మొదలు పెట్టారు. వారియర్ మామ్స్ అనే పేరుతో వాస్తవం కేంద్రానికి తెలియజెప్పాలనుకుంటున్నారు. పోస్ట్ కార్డ్ ల ఉద్యమాన్ని చేపట్టారు.

దేశంలోని గృహిణులు, మాతృమూర్తులు వారియర్ మామ్స్ అనే పేరుతో ఓ బృందంగా ఏర్పడ్డారు. వారంతా కలసి కేంద్ర మంత్రులకు, లేఖాస్త్రాలు సంధించారు. కూడా పోస్ట్ కార్డ్ లపై తమ బాధల్ని రాసి వారికి తపాలాలో పంపించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ కు లేఖలు రాశారు. గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గించాలన్నారు, అరకొరగా విదిలిస్తున్న సబ్సిడీ ఏమాత్రం సరిపోవట్లేదని అన్నారు. వచ్చే బడ్జెట్‌ కేటాయింపుల్లో పీఎంయూవై కింద ఇస్తున్న రాయితీని పెంచాలన్నారు. సాధారణ ఎల్పీజీ వినియోగదారులకు కూడా రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ రేట్లు పెరగడంతో ప్రత్యామ్నాయాలవైపు ప్రజలు ఆలోచిస్తున్నారని, పర్యావరణానికి ఇది మంచిది కాదని తమ లేఖల్లో కేంద్రానికి హితవు పలికారు.

ఎల్పీజీ రేట్లు భారీగా పెరిగిపోవడంతో పాటు, రాయితీని ఎత్తేయడంతో గ్రామాలు, పట్టణ శివార్లలోని పేదలు, మధ్య తరగతి ప్రజలు కట్టెల పొయ్యి మీదే వంట చేయాల్సి వస్తోందని పలువురు మాతృమూర్తులు ఆవేదన చెందుతున్నారు. ఇరుకు ఇళ్లలో పొగ కారణంగా చిన్నారులు, వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ‘వారియర్‌ మామ్స్‌’ అనే పేరుతో జరుగుతున్న ఈ ఉద్యమానికి రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ జాబితాలో బీజేపీ నేతలు మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీ కూడా ఉండటం విశేషం. ఎంపీలు శశి థరూర్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, సౌగతా రాయ్‌, మహువా మజీ, మహ్మద్‌ బషీర్‌, వందనా చవాన్‌, మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్‌ గాంధీ కూడా వారియర్ మామ్స్ కి మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సహకరిస్తున్నారు.

First Published:  13 Jan 2023 7:17 AM IST
Next Story