Telugu Global
National

ఈ ఏటీఎంలో డబ్బులు రావు... ఇడ్లీలొస్తాయి

ఏటీఎం అంటే డబ్బులు ఇచ్చేదనికదా అనుకుంటాం...కానీ బెంగళూరులో ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంటర్నెట్ లో ఇడ్లీ ఏటీఎం వీడియో వైరల్ గా మారింది.

ఈ ఏటీఎంలో డబ్బులు రావు... ఇడ్లీలొస్తాయి
X

బెంగళూరుకు చెందిన షరన్ హీరేమత్ అనే వ్యక్తి కూతురుకు 2016లో ఓ సారి ఆరోగ్యం బాగోలేదు. అర్దరాత్రి ఆ అమ్మాయికి ఆకలేసింది. ఎలాగైనా తన కూతురి కోసం వేడి వేడి ఇడ్లీలు తెచ్చివ్వాలని బెంగళూరు అంతా తిరిగాడు. కానీ ఆ అర్దరాత్రి ఇడ్లీలు ఎక్కడా దొరకలేదు. అప్పుడాయన, ఆరోగ్య బాగోలేని కూతురుకు ఇడ్లీలు తెచ్చివ్వలేక పోయానని బాధపడ్డాడు. ఎప్పుడంటే అప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంలు ఉన్నట్టు, ఇడ్లీ కొనడానికి ఏటీఎంలు ఉంటే బావుండు కదా అనుకున్నాడు. ఆ త‌ర్వాత కొద్ది రోజులకు హీరేమత్ తన స్నేహితుడైన సురేష్ చంద్రశేఖరన్ అనే మెకానికల్ ఇంజనీర్ తో కలిసి ఓ రోడ్ ట్రిప్ కు వెళ్ళాడు. అక్కడ‌ ఓ హోటల్‌లో వీరికి పాడైన ఇడ్లీలు సప్లై చేశారు. దాంతో హీరేమత్ కు ఇడ్లీ ఏటీఎం అనే ఆలోచన వచ్చింది. చంద్ర శేఖర్ తో చర్చించాడు. ఇక వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇద్దరు కలిసి 'ఫ్రెషాట్ రోబోటిక్స్' అనే స్టార్టప్‌ ప్రారంభించారు.

అది గతం...ఇప్పుడు వర్తమానానికి వద్దాం....

బెంగళూరు ప్రధాన రోడ్డు లో ఓ పెద్ద ఆటోమేటెడ్ మిషన్ ఏ టైంలో వెళ్ళినా వేడి వేడి ఇడ్లీలను అందిస్తోంది. ఈ ఇడ్లీ వెండింగ్ మెషిన్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.QR కోడ్ ద్వారా ఇది పని చేస్తుంది. అప్లికేషన్ కోడ్‌ని స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా ఆర్డర్ చేయవచ్చు. వెండింగ్ మెషీన్‌లో ఇడ్లీలతో పాటు వడలు కూడా అందుబాటులో ఉంటాయి. వెంట వెంటనే ఇడ్లీని తయారు చేసి,చట్నీ, సాంబార్‌తో పాటు రీసైక్లింగ్ చేయగల ప్యాకేజింగ్‌లో ప్యాక్ చేసిమీకు అందిస్తుంది.

ఈ మిషన్ ఒక సైకిల్‌లో 72 ఇడ్లీలను తయారు చేయగలదు. ఫ్రెష్‌షాట్ రోబోటిక్స్ బృందం అంచనా ప్రకారం ఇడ్లీలు 10 నుండి 12 నిమిషాల్లో ఉడుకుతాయి. మెషిన్ లో పిండిని పోసి శుభ్రం చేయడానికి 18 నుండి 20 నిమిషాలు అవసరం. ఇది ఒకేసారి నాలుగు రకాల ఇడ్లీలను సిద్ధం చేయగలదు, సాదా, పాలక్, క్యారెట్, మిల్లెట్ లాంటి వైవిధ్యాలతో ఇడ్లీలను తయారు చేస్తుంది. వీటితో పాటు వడలను కూడా తయారు చేస్తుందీ మిషన్.

ఈ ఇడ్లీ ఏటీఎం వీడియో ఇంటర్నెట్ లో ఇప్పటికే లక్షల వ్యూస్ ను సంపాదించుకుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియోను షేర్ చేశారు.

బెంగళూరులో మొదటి ఏటీఎం ను ఏర్పాటు చేసిన షరన్ హీరేమత్ కు చెందిన ఫ్రెష్‌షాట్ రోబోటిక్స్ సంస్థ దీని విజయంపై ఆధారపడి దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తోంది.

అర్దరాత్రి ఆకలయ్యి ఏమీ దొరకక ఇబ్బందిపడేవాళ్ళకు, అర్దరాత్రుళ్ళు పని చేసే వాళ్ళకు ఈ ఇడ్లీ ఏటీఎం మంచి పరిష్కారమనే చెప్పాలి.

కింద ఇడ్లీ ఏటీఎం వీడియో చూడండి....





First Published:  17 Oct 2022 10:08 AM GMT
Next Story