మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా 'వాల్ స్ట్రీట్ జర్నల్' లో ప్రకటన - కేంద్ర ప్రభుత్వంలో ప్రకంపనలు
'ఇండియాస్ మాగ్నిట్స్కీ11' పేరుతో వాల్ స్ట్రీట్ జర్నల్ లో అచ్చయిన ఓ ప్రకటన భారత సర్కారును ఇరుకున పెడుతోంది. భారత్ పెట్టుబడిదారులకు ప్రమాదకర దేశమని ఆ ప్రకటన పేర్కొంది.
అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో శనివారం వచ్చిన ఓ పూర్తి పేజీ ప్రకటన భారత్ లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీలో ప్రకంపనలు సృష్టించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రకటనపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ ప్రకటనను ఖండిస్తున్నారు.
'ఇండియాస్ మాగ్నిట్స్కీ11' పేరుతో విడుదలైన ఈ ప్రకటనలో మోడి హయాంలో భారతదేశం పెట్టుబడులు పెట్టడానికి ప్రమాదకరంగా తయారయ్యిందని పేర్కొంది. మోడి నాయకత్వంలో పని చేస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యాంట్రిక్స్ చైర్మన్ రాకేష్ శశిభూషణ్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకట్రామన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, వి. రామసుబ్రమణియన్, సీబీఐ డీఎస్పీ ఆశిష్ పరీక్, ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా, డిప్యూటీ డైరెక్టర్ ఏ. సాదిక్ మహ్మద్ నైజ్నార్, అసిస్టెంట్ డైరెక్టర్ R. రాజేష్,ప్రత్యేక న్యాయమూర్తి చంద్ర శేఖర్ లు భారత దేశంలో ఎవరూ పెట్టుబడులు పెట్టకుండా చేస్తున్నారని ఆ ప్రకటన ఆరోపించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచబ్యాంకు సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికాలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం.
"ఈ మోడీ ప్రభుత్వ అధికారులు రాజకీయ, వ్యాపార ప్రత్యర్థుల పై జాతీయ దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్నారు. న్యాయ పాలనను నిర్వీర్యం చేసారు, భారతదేశాన్ని పెట్టుబడిదారులకు రక్షణ లేకుండా చేశారు.'' .
"గ్లోబల్ మాగ్నిట్స్కీ హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద వారిపై ఆర్థిక ఆంక్షలు, వీసా ఆంక్షలు విధించాలని మేము US ప్రభుత్వాన్ని కోరాము. మోడీ హయాంలో, చట్టబద్ధమైన పాలన క్షీణించడం వల్ల భారతదేశం పెట్టుబడులకు ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది. మీరు భారతదేశంలో పెట్టుబడిదారులైతే, మీరు ప్రమాదంలో ఉండవచ్చు, "అని ప్రకటన పేర్కొంది.
ఈ ప్రకటన చివర ఓ క్యూ ఆర్ కూడా ఉంది దాన్ని స్కాన్ చేస్తే ఇది 'ఫ్రాంటియర్స్ ఆఫ్ ఫ్రీడమ్' అనే వెబ్‌సైట్‌కి దారి తీస్తుంది. ఇది US కు చెందినది.
1995లో U.S. సెనేటర్ మాల్కం వాలోప్ స్థాపించిన ఫ్రాంటియర్స్ ఆఫ్ ఫ్రీడమ్ (FF)కి జార్జ్ లాండ్రిత్ నాయకత్వం వహిస్తున్నారు, అతను 1999 నుండి ఈ పదవిలో కొనసాగుతున్నాడు.
ఆ వెబ్‌సైట్‌లో, ఈ సంస్థ తన గురించి వ్యక్తిగత స్వేచ్ఛ, శాంతి, పరిమిత ప్రభుత్వం, స్వేచ్ఛా మార్కెట్లు, సాంప్రదాయ అమెరికన్ విలువలు, సూత్రాలను ప్రోత్సహిస్తుందని వర్ణించుకుంటుంది.
అయితే ఈ భారత వ్యతిరేక ప్రచారాన్ని దేవాస్ మల్టీమీడియా మాజీ సీఈఓ రామచంద్రన్ విశ్వనాథన్ నిర్వహిస్తున్నారని భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా పేర్కొన్నారు.
సెప్టెంబరులో, బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఓ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విశ్వనాథన్‌ను 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు'గా ప్రకటించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)ని అనుమతించింది. అందువల్లే ఆయన ఈ విధమైన ప్రచారాన్ని చేస్తున్నాడని అధికారుల వాదన.
ఆగస్ట్‌లో 'ఫ్రాంటియర్ ఆఫ్ ఫ్రీడమ్' గ్లోబల్ మాగ్నిట్స్కీ హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద గతంలో ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది, ఇది మానవ హక్కుల దుర్వినియోగం లేదా అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించబడిన విదేశీయులెవరిపైనైనా ఆర్థిక ఆంక్షలు విధించడానికి, అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి US అధ్యక్షుడికి అధికారం ఇస్తుంది.
ఈ పిటీషన్ ప్రకారం, ఒక కాంట్రాక్ట్ వివాదంలో తమ బాధ్యతను తప్పించుకునేందుకు భారతీయ అధికారులు భారతదేశ నేర పరిశోధనా సంస్థలను, న్యాయస్థానాలను దుర్వినియోగం చేశారని పేర్కొంది.
" భారతదేశం పెట్టుబడి పెట్టడానికి ప్రమాదకరమైన ప్రదేశం అని ఇండియాస్ మాగ్నిట్స్కీ11, సీతారామన్, నరేంద్రమోడీ , బిజెపి లు భారతదేశంలోని పెట్టుబడిదారులకు స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నాయి" అని 'ఫ్రాంటియర్ ఆఫ్ ఫ్రీడమ్' అధ్యక్షుడు జార్జ్ లాండ్రిత్ ట్వీట్ చేశారు.
ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చిన ఈ ప్రకటన కేంద్ర ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ''అమెరికన్ ఫ్రాడ్ మీడియా భారతదేశం మరియు దాని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దిగ్భ్రాంతికరమైన, నీచమైన ప్రకటన ప్రచురించింది. ఇది అవమానకరమైన దాడి. దీని వెనక దేవాస్ సీఈవోగా పనిచేసి పరారీలో ఉన్న రామచంద్ర విశ్వనాథన్ ఉన్నారు'' అని భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ట్వీట్ చేశారు.
Shameful weaponisation of American media by fraudsters.
— Kanchan Gupta (@KanchanGupta) October 15, 2022
This shockingly vile ad targeting #India and its Government appeared in @WSJ .
Do you know who is behind this and similar ads?
This ad campaign is being run by fugitive Ramachandra Vishwanathan, who was the CEO of Devas.
n1 pic.twitter.com/o7EWFmMsSR