Telugu Global
National

140 మంది మరణించిన గుజరాత్ లోని బ్రిడ్జి కొలాప్స్ సంఘటన వెనక‌ నమ్మలేని నిజాలు

గుజరాత్ లో 140 మంది మరణించిన బ్రిడ్జి కొలాప్స్ సంఘటనలో నమ్మలేని నిజాలు బైటపడుతున్నాయి. పాడైపోయి ఆరునెలలుగా మూతపడి ఉన్న ఆ బ్రిడ్జి పునర్నిర్మాణాన్ని ప్రభుత్వం ఏ మాత్రం అనుభవంలేని ఓ సంస్థకు అప్పజెప్పిందన్న విషయం మీడియా బైటపెట్టింది.

140 మంది మరణించిన గుజరాత్ లోని బ్రిడ్జి కొలాప్స్ సంఘటన వెనక‌ నమ్మలేని నిజాలు
X

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జి కూలి 140 మంది మృతి చెందిన విషాధ సంఘటన దేశవ్యాప్తంగా కంతోంది. బ్రిడ్జిపైన ఉండల్సిన సందర్శకులకన్నా ఎక్కువమందిని అధికారులు అనుమతించార‌ని, బరువు ఎక్కువై బ్రిడ్జి కూలిపోయిందనే ఓ వాదన వినిపిస్తు‍ండగా. అసలు ఏ మాత్రం అనుభవంలేని ఓ సంస్థకు బ్రిడ్జి పునరుద్దరణ కాంట్రాక్ట్ అప్పజెప్పారన్న విషయం ఇప్పుడే బైటపడింది.

వంద సంవత్సరాల పైబడ్డ ఈ బ్రిడ్జి ఆరునెలల క్రితం పాడైపోవడంతో దానిని ఆరునెలలుగా మూసేసి నాలుగు రోజుల క్రితమే తిరిగి ప్రారంభించారు. అయితే ఆ బ్రిడ్జి పునరుద్దరణ పనులను గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ కు చెందిన ఒరెవా గ్రూప్ కు ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ సంస్థ CFL బల్బులు, గోడ గడియారాలు, ఈ‍బైక్ లు తయారు చేస్తుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం...దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఓధవ్‌జీ రాఘవ్‌జీ పటేల్‌చే స్థాపించబడిన ఈ సంస్థ ప్రముఖ అజంతా, ఓర్పాట్ బ్రాండ్ల పేరుతో గోడ గడియారాలను తయారు చేస్తుంది.ఈ నెల ప్రారంభంలో 88 సంవత్సరాల వయస్సులో మరణించిన పటేల్, 1971లో ఈ సంస్థను ప్రారంభించారు. దాదాపు రూ.800 కోట్ల టర్నోవర్‌తో, ఇప్పుడు గృహోపకరణాలు, విద్యుత్ ఉపకరణాలు, విద్యుత్ దీపాలు, కాలిక్యులేటర్లు, సిరామిక్ ఉత్పత్తులు, ఈ-బైక్‌లను తయారు చేస్తోంది. నిర్మాణ రంగంలో కనీస అనుభవం కూడా లేని ఈ కంపెనీతో మోర్బీ బ్రిడ్జికి ప్రభుత్వం మరమ్మతులు చేయించిన వైనం ఇప్పుడు బయటపడింది. ఈ గ్రూపు వెబ్ సైట్ లో కూడా తమకు నిర్మాణ రంగంలో అనుభవముందని పేర్కొనలేదు.

ఈ సంవత్సరం మార్చిలో మోర్బీ బ్రిడ్జి మరమ్మతులతో పాటు బ్రిడ్జి నిర్వహణను 15 ఏళ్ల పాటు చేపట్టేందుకు ఒరెవా గ్రూప్ గుజరాత్ సర్కారు నుంచి కాంట్రాక్టు పొందింది.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒరెవా గ్రూప్ కు చెందిన ప్రతినిధి మాట్లాడుతూ, వంతెన మధ్యలో ఉన్న చాలా మంది వ్యక్తులు దానిని ఒక వైపునుండి మరొక వైపుకు ఊపారని, దానివల్లే వంతెన కూలిపోయిందని అన్నారు.

అయితే నిర్మాణ రంగంలో కానీ, కేబుల్ బ్రిడ్జి తయారీ రంగంలో కానీ ఎటువంటి కనీస అనుభవం లేని ఒరెవా గ్రూప్ కు గుజరాత్ ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ ఎలా అప్పజెప్పిందనేది జవాబు లేని ప్రశ్న.

కారణాలేమనప్పటికీ 140 మంది మరణించిన ఈ విషాదం నుంచి గుజరాత్ ఇప్పట్లో కోలుకుంటుందా ? ఆ కుటుంబాలు పరిస్థితి ఏమవుతుంది. తల్లితండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లితండ్రులు, మొత్తం కుటుంబాలనే కోల్పోయి ఏకాకులుగా మిగిలినవాళ్ళకు ఈ ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది ?




First Published:  31 Oct 2022 6:03 PM IST
Next Story