Telugu Global
National

ఇంటి నుంచే ఓటు.. కర్నాటకలో సూపర్ సక్సెస్

80ఏళ్లు పైబడిన వృద్ధుల్లో 80,250 మంది ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో శనివారం పోలింగ్ ముగిసే నాటికి 75,690 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇంటి నుంచే ఓటు.. కర్నాటకలో సూపర్ సక్సెస్
X

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఇంటినుంచే ఓటు కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటి వరకు అక్కడక్కడ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసినా, తొలిసారిగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటుని పూర్తి స్థాయిలో మొదలు పెట్టారు. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులబారిన పడినవారికి ఈ అవకాశం కల్పించారు. ఏప్రిల్ 29నుంచి మే-6 వరకు ఇంటినుంచే ఓటు కార్యక్రమం కొనసాగింది. మొత్తం 94.8శాతం మంది తమ ఓటు హక్కుని ఇలా ఇంటినుంచే ఉపయోగించుకున్నారు.

పోలింగ్ లో చైతన్యం

కర్నాటకలో ఈసారి కచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చేయాలని ఓటర్లు ఆలోచిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. దీనికి తగ్గట్టే వోట్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమంలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. ఈనెల 10న జరిగే ఎన్నికల్లో కూడా భారీ స్థాయిలో పోల్ పర్సంటేజ్ నమోదవుతుందనే అంచనాలున్నాయి.

వృద్ధులూ జిందాబాద్..

80ఏళ్లు పైబడిన వృద్ధుల్లో 80,250 మంది ఇంటినుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో శనివారం పోలింగ్ ముగిసే నాటికి 75,690 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికలాంగుల్లో 19,279 మంది రిజిస్టర్ చేసుకోగా 18,636 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇంటినుంచి ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి వద్దకు అధికారులే బ్యాలెట్ పేపర్ తో వచ్చారు. ఎన్నికల సిబ్బంది, విలేకరులు, పోలీసుల సమక్షంలో వారు ఓటు వేసి, దాన్ని బ్యాలెట్ బాక్స్ లో వేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు.

అసలు పోలింగ్ ఈనెల 10న సింగిల్ ఫేజ్ లో ముగుస్తుంది. ఈవీఎంల ద్వారా ఈ ఓటింగ్ జరుగుతుంది. ఈనెల 13న ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎం ఓట్లతోపాటు, పోస్టల్ బ్యాలెట్లు, వోట్ ఫ్రమ్ హోమ్ బాక్స్ లు ఓపెన్ చేసి మొత్తం కలిపి లెక్కిస్తారు. ఫలితాలు ప్రకటిస్తారు.

First Published:  7 May 2023 10:04 AM IST
Next Story