Telugu Global
National

కేజ్రీవాల్‌ మాట్లాడకూడదని ఎక్కడా చెప్పలేదు

ఇది కేవలం ఆయన ఊహని, దానిపై తాము ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోమని తెలిపింది. ఆయన ఎప్పుడు లొంగిపోవాలో తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నామని చెప్పింది.

కేజ్రీవాల్‌ మాట్లాడకూడదని ఎక్కడా చెప్పలేదు
X

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను మాట్లాడకూడదని తమ తీర్పులో ఎక్కడా పేర్కొనలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం రాజకీయ చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై వాదనల సందర్భంగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం గురువారం స్పష్టత ఇచ్చింది.

కేజ్రీవాల్‌ అభ్యంతరకర ప్రసంగాలు చేస్తున్నారంటూ ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనం ముందు ప్రస్తావించారు. కేజ్రీవాల్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదని ఆయన తెలిపారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలంతా తనకు ఓటేస్తే, తాను మళ్లీ తిరిగి జైలుకు వెళ్లనంటూ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

దీనిపై స్పందించిన కోర్టు.. ఇది కేవలం ఆయన ఊహని, దానిపై తాము ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోమని తెలిపింది. ఆయన ఎప్పుడు లొంగిపోవాలో తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నామని చెప్పింది. ఇది సుప్రీంకోర్టు తీర్పని, ఉత్తర్వుల్లో ఎక్కడా కేసు గురించి ఆయన మాట్లాడకూడదని తాము చెప్పలేదని స్పష్టం చేసింది. బెయిల్‌ విషయంలో ఢిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులూ ఇవ్వలేదని కూడా తెలిపింది. తమ తీర్పు స్పష్టంగా ఉందని, తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పులో పేర్కొన్నామని చెప్పింది.

తాము ఇచ్చిన తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలను స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కేజ్రీవాల్‌ తరపు న్యాయవాదుల వాదనలను వినేందుకు ధర్మాసనం నిరాకరించింది.

ఈ తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెయిల్‌ తీర్పు సాధారణంగా లేదని, కేజ్రీవాల్‌ విషయంలో సుప్రీంకోర్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్న అభిప్రాయం కలిగించేలా ఉందని ఇటీవల పేర్కొన్నారు. గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఆ వ్యాఖ్యలను కేజ్రీవాల్‌ తరపు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ.. అమిత్‌ షా పేరు ప్రస్తావించకుండా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ వ్యాఖ్యల జోలికి తాము పోదల్చుకోలేదని న్యాయమూర్తులు తెలిపారు.

First Published:  17 May 2024 10:57 AM IST
Next Story