Telugu Global
National

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి

అధ్యక్ష ఎన్నికల రేసులోకి దూసుకొచ్చిన రామస్వామి దక్షిణ భారతదేశం నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులకు ఓహియోలో జన్మించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి వైదొలిగారు. రిపబ్లిక్ పార్టీ తరఫున తాను చేపడుతున్న అభ్యర్థిత్వ ప్రచారం నుంచి వైదొలుగుతున్నట్లు వివేక్ రామస్వామి స్వయంగా ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన మద్ధతు ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ప్రాథమిక ఎన్నికల్లో భాగంగా అయోవా రాష్ట్రం నుంచి ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆశించిన స్థాయిలో మద్దతు రాకపోవడంతో వెనక్కి తగ్గారు. అయోవా కాకస్‌లో 50.9 శాతం ఓట్లతో ట్రంప్ ముందంజలో ఉండగా, రాన్‌ డిశాంటిస్ రెండో స్థానంలో, నిక్కీ హేలీ మూడో స్థానంలో, వివేక్ రామస్వామి నాలుగో స్థానంలో నిలిచారు.

అధ్యక్ష ఎన్నికల రేసులోకి దూసుకొచ్చిన రామస్వామి దక్షిణ భారతదేశం నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులకు ఓహియోలో జన్మించారు. ఈ 38 ఏళ్ల మల్టీ మిలియనీర్.. 2024 రిపబ్లికన్ అభ్యర్థి రేసులోకి దూసుకొచ్చిన ఆయన తనదగ్గరున్న అపార ఆర్థిక నిధులతోపాటు ధైర్యంగా మాట్లాడుతూ.. దూకుడుగా ప్రచారం నిర్వహించారు. ఇమ్మిగ్రేషన్‌, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలతో ఆకర్షించారు. తన బలమైన అభిప్రాయాలతో చాలామందిని ఆకట్టుకున్నట్టే కనిపించారు. అయితే రామస్వామి ప్రచార వ్యూహం, విధానాలు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నినాదాలకు దగ్గరగా ఉండడం మైనస్ అయ్యింది. మరోవైపు రామస్వామి ఎంత మద్దతుగా మాట్లాడినా ట్రంప్‌ మాత్రం రామస్వామిని బహిరంగంగానే వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా బాగా నెగెటివ్ ప్రచారం చేయించారు. దీంతో భారతీయ-అమెరికన్‌ అయిన వివేక్ రామస్వామికి ఆదరణ తగ్గిపోయింది.

చివరికి అయోవా రాష్ట్రం రిపబ్లికన్ కాకస్‌ ఎన్నికల్లో వివేక్ రామస్వామికి 7.7 శాతం ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితం కాగా.. 51 శాతం ఓట్లతో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో అధ్యక్ష పదవి రేసులో ట్రంప్‌కు రామస్వామి మద్దతు పలికారు.

First Published:  16 Jan 2024 12:40 PM GMT
Next Story