Telugu Global
National

అత్యాచారం నిర్ధారణకు 'టూ ఫింగర్ టెస్ట్'... మహిళల‌ను అవమానించడమేనన్న‌ సుప్రీంకోర్టు

అత్యాచారం జరిగినట్టు తేల్చడానికి టూ ఫింగర్ టెస్ట్ నిర్వహించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మహిళ గౌరవానికి వ్యతిరేకమైన ఈ 'టూ ఫింగర్ టెస్ట్' నిర్వహించకుండా చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అత్యాచారం నిర్ధారణకు టూ ఫింగర్ టెస్ట్... మహిళల‌ను అవమానించడమేనన్న‌ సుప్రీంకోర్టు
X

అత్యాచార బాధితులను పరీక్షించేందుకు 'టూ ఫింగర్ టెస్ట్' చేసే విధానం ఇప్పటికీ సమాజంలో కొనసాగడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది.

మహిళ గౌరవానికి వ్యతిరేకమైన ఈ 'టూ ఫింగర్ టెస్ట్' నిర్వహించకుండా చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాల డిజిపిలు, ఆరోగ్య శాఖ కార్యదర్శులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఓ అత్యాచారం, హత్య కేసులో నేరస్థుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని న్యాయమూర్తులు DY చంద్రచూడ్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. అతనిని దోషిగా పేర్కొన్న‌ ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.

'టూ ఫింగర్ టెస్ట్' కు వ్యతిరేకంగా దశాబ్ద కాలం క్రితమే సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ ఇప్పటికీ కొనసాగించడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

"ఈ రోజుకి కూడా ఈ పద్దతి కొనసాగించడం దురదృష్టకరం... యోని లాక్సిటీని పరీక్షించే ఈ ప్రక్రియ మహిళల గౌరవానికి భంగకరమైనది. లైంగికంగా చురుకుగా ఉన్న మహిళపై అత్యాచారం జరగదని చెప్పలేము" అని బెంచ్ పేర్కొంది.

ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల పాఠ్యాంశాల నుంచి టూ ఫింగర్ టెస్ట్ లకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శులను కోర్టు ఆదేశించింది.

First Published:  31 Oct 2022 9:25 AM GMT
Next Story