Rahul Gandhi Disqualification: భగ్గుమన్న విపక్షాలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.
లోక్ సభ సెక్రటేరియట్ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో పలువురు విపక్ష నేతలు బీజేపీపై విమర్శలు గుప్పించారు, అధికార పార్టీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్యానికి ఇది కొత్త పతనమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్ తో సహా అనేక మంది విపక్ష నేతలు రాహుల్ కు మద్దతు ప్రకటించారు.
మన దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ చీకటి రోజని కేసీఆర్ మండిపడ్డారు. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని నరేంద్ర మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని బీఆరెస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక చిన్న మాట అన్నందుకు రాహుల్ గాంధీ వంటి నేతపై వేటు వేయడం దారుణమని డీఎంకే ఛీఫ్ స్టాలిన్ అన్నారు. సోదరుడు రాహుల్ తో తాను మాట్లాడానని, ఆయనకు తన సంఘీభావాన్ని ప్రకటించానని తెలిపారు. చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలన్నారు. కొందరిని జైలుకు పంపిస్తున్నారని, మరికొందరి సభ్యత్వం రద్దు చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.
టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలే బిజెపి ప్రధాన లక్ష్యంగా మారారని అన్నారు.
“ప్రధాని మోడీ నవ భారతంలో, ప్రతిపక్ష నాయకులు బీజేపీకి ప్రధాన లక్ష్యంగా మారారు! నేర చరిత్ర కలిగిన బీజేపీ నేతలను కేబినెట్‌లోకి తీసుకుంటే, ప్రతిపక్ష నేతలేమో వారు చేసిన ప్రసంగాల కారణంగా అనర్హతకు గురవుతున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం అధోగతి పాలవడం ఈ రోజు మనం చూస్తున్నాం.'' అని ఆమె ట్వీట్ చేశారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే రాహుల్‌పై వేటు వేశారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
దొంగ అన్నందుకు రాహుల్ సభ్యత్వం తొలగిస్తారా అని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కన్నెర్ర చేశారు. దేశంలో దొంగలు, దోపిడిదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారిని శిక్షించకుండా రాహుల్‌ను శిక్షిస్తారా అని ఉద్ధవ్ ప్రశ్నించారు. దీన్ని ప్రజాస్వామ్య హత్యగా ఆయన అభివర్ణించారు. నియంతృత్వానికి ఇది ఆరంభ సూచిక అని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.
భారతదేశ ప్రజాస్వామ్యం ఎటు పోతుందని సీపీఐ నేత బినోయ్ విశ్వం ప్రశ్నించారు.
“మన ప్రజాస్వామ్యం ఎటువైపు పయనిస్తోంది? కోలార్‌లో చేసిన ప్రసంగానికి, సూరత్‌లో కేసు. అది కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత? ఈరోజు రాహుల్ గాంధీ, రేపు నువ్వు కావచ్చు, నేను కావచ్చు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది.'' అన్నారు బినోయ్ విశ్వం.
గాంధీపై అనర్హత వేటు వేయడం దురదృష్టకరమని బీఎస్పీ ఎంపీ డానిష్ అభివర్ణించారు. పరువు నష్టం కలిగించే విషయాల్లో ఎంపీలు తమ సభ్యత్వాన్ని కోల్పోతే, 70 శాతం మంది పార్లమెంటేరియన్లు తమ సభ్యత్వాన్ని కోల్పోతారని, వారిలో ఎక్కువ మంది బీజేపీకి చెందినవారే ఉంటారని ఆయన పేర్కొన్నారు.
కాగా, ''దొంగలందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకుంటుంది '' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినందుకుగాను గుజరాత్ లోని సూరత్ కోర్టు నిన్న ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు ఆధారంగా లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీని ఈ రోజు అనర్హులుగా ప్రకటించింది.