Telugu Global
National

చంద్రుడికి అడుగు దూరంలో విక్రమ్ ల్యాండర్.. చివరి డీ-బూస్టింగ్ విజయవంతం

విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి నుంచి అత్యల్పంగా 25 కిలోమీటర్లు అత్యధికంగా 134 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది.

చంద్రుడికి అడుగు దూరంలో విక్రమ్ ల్యాండర్.. చివరి డీ-బూస్టింగ్ విజయవంతం
X

చందమామపై అడుగు పెట్టడానికి విక్రమ్ ల్యాండర్ ల్యాండర్ సిద్ధమైంది. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగంలో కీలకమైన ఘట్టాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. చివరిదైన రెండో డీ-బూస్టింగ్ ప్రక్రియను శనివారం అర్థరాత్రి 1.50 గంటల తర్వాత విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రుడి అతి దగ్గర కక్ష్యలోకి విక్రమ్ మాడ్యుల్ చేరింది.

విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి నుంచి అత్యల్పంగా 25 కిలోమీటర్లు అత్యధికంగా 134 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. రెండో డీ-బూస్టింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో చంద్రుడిపై దిగడానికి ల్యాండర్ ఒక అడుగు దూరంలో ఉన్నట్లు ఇస్రో తెలిపింది. ఇక చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయించడమే మిగిలింది.

అన్నీ అనుకూలిస్తే ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో విక్రమ్ ల్యాండర్ కాలు పెట్టనున్నట్లు ఇస్రో చెప్పింది. కాగా, దక్షిణ ధ్రువంపై సూర్యోదయం కావడం కోసం ఇస్రో ఎదురు చూస్తోంది. అంతే కాకుండా ల్యాండర్ పని తీరును అంతర్గతంగా తనిఖీ కూడా చేస్తోంది. ఈ నెల 23 సాయంత్రం 5.45 తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఇస్రో చెప్పింది.

రష్యా లూనా-25 ల్యాండర్‌లో సమస్యలు..

చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌లో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తున్నది. దీంతో దాని భవితపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ల్యాండర్‌లో ఏర్పడిన సమస్యను విశ్లేషిస్తున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ తెలిపింది. ప్రస్తుతం వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలో పరిభ్రమమిస్తోంది. ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్‌కు చేరడానికి శనివారం లూనా-25 కీలక విన్యాసం చేపట్టింది. ఈ క్రమంలోనే వ్యోమనౌక ఆటోమేటిక్ స్టేషన్‌లో ఎమర్జెన్సీ ఏర్పడింది.

దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై ల్యాండింగ్‌కు రష్యా ప్రయత్నిస్తోంది. ఇస్రో పంపిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగనున్న దక్షిణ ధ్రువానికి సమీపంలోనే లూనా-25 కూడా దిగాల్సి ఉన్నది. చంద్రయాన్-2 కంటే లూనా రెండు రోజుల ముందు దిగుతుందని అంచనా వేశారు. కానీ, ఇప్పుడు సమస్య తలెత్తడంతో ల్యాండింగ్ ఎప్పుడు జరుగుతుందో రష్యా ఇంకా స్పష్టం చేయలేదు.


First Published:  20 Aug 2023 4:56 AM GMT
Next Story