Telugu Global
National

ఏడు సార్లు కాదు, ఒకసారే పాముకాటు.. ఈ అబ్బాయికి స్నేక్ ఫోబియా..

తనకి కలలో కూడా పాము వచ్చిందని, అది తనను 9 సార్లు కాటేస్తానని చెప్పిందని వివ‌రించాడు వికాస్.

ఏడు సార్లు కాదు, ఒకసారే పాముకాటు.. ఈ అబ్బాయికి స్నేక్ ఫోబియా..
X

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఓ యువకుడిని 40 రోజుల వ్యవధిలో 7 సార్లు పాము కాటు వేసింది అంటూ ఒక వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆ యువకుడిని ఒక్కసారి మాత్రమే పాము కాటు వేసినట్లు విచారణలో తేలింది. అయితే అతనికున్న మానసిక అనారోగ్యం కారణంగా ఆ యువకుడు పాము తనను పదే పదే కాటేస్తోందని అనుకుంటూనే ఉన్నాడు.

వివరాల్లోకి వెళితే..

మాల్వా​ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామానికి చెందిన వికాస్ ద్విదేది అనే యువకుడు సుమారు 40 రోజుల వ్యవధిలోనే ఏడుసార్లు పాము కాటుకు గురయ్యానని చెప్పాడు. ఇదే కారణం చెప్పి పదే పదే ఆస్ప‌త్రికి కూడా వెళ్తున్నాడు. వైద్యులు కూడా అదే తరహా చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. మరోవైపు తనకి కలలో కూడా పాము వచ్చిందని, అది తనను 9 సార్లు కాటేస్తానని చెప్పిందని వివ‌రించాడు వికాస్. 8 సార్లు నువ్వు బతుకుతావు కానీ, 9వ సారి మాత్రం నిన్ను నా వెంట తీసుకెళ్తాను అని చెప్పినట్లు కుటుంబసభ్యుల వద్ద వాపోయాడు. విషయం వైరల్ అవ్వటంతో ఈ ఘటనపై అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది.

ఇప్పుడు ఆ రిపోర్టు బయటకు రాగానే అందరూ షాక్ అయ్యారు. స్నేక్ ఫోబియా కారణంగా వికాస్ మళ్లీ మళ్లీ పాము కాటుకు గురవుతున్నట్లు భ్రమించాడు. వైద్యులు కూడా వికాస్‌కు స‌రైన వైద్యం అందించ‌లేదు. అయితే ఇందుకు సంబంధించిన నివేదికను ఆరోగ్య శాఖ జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించగా అందలో ఉన్న విషయాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిపుణుల పరిశీలనలో యువకుడికి స్నేక్ ఫోబియా ఉన్నట్లు తేలింది. దీనిపై విచారణకు జిల్లా ముఖ్య ఆరోగ్య అధికారి ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వికాస్‌కు వైద్యం అందించిన వైద్యుల తప్పు కూడా ఇందులో ఉందని ఈ నివేదికలో వారు పేర్కొన్నారు.

First Published:  17 July 2024 6:07 PM IST
Next Story