Telugu Global
National

ఆ సినిమా ఫ్లాపైంది.. బీజేపీ పండగ చేసుకుంటోంది..

."టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్ పప్పులు ఉడకలేదు." అంటూ ట్వీట్ చేశారు బీజేపీ నేత విజయశాంతి.

ఆ సినిమా ఫ్లాపైంది.. బీజేపీ పండగ చేసుకుంటోంది..
X

ఒక సినిమా ఫ్లాపయితే, ఒక రాజకీయ పార్టీ పండగ చేసుకుంటుందా..? అసలు రాజకీయ పార్టీలు సినిమాలపై అంత సీరియస్‌గా దృష్టిపెడతాయా..? భారత్‌లో ఇలాంటివి సహజమే. లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాపైందంటూ బీజేపీ నేతలు పండగ చేసుకుంటున్నారు. కారణం ఆ సినిమా కంటెంట్ కాదు, ఆ సినిమా హీరో. ఇప్పటి వరకూ సినిమాలో కంటెంట్ మనోభావాలను నొప్పించేలా ఉందంటూ వివిధ సంఘాలు నిరసనలకు దిగడం చూశాం. కానీ తొలిసారిగా ఫలానా హీరో మా మనోభావాలను నొప్పించారని, ఆ హీరో సినిమా ఫ్లాప్ కావాలని కోరుకున్నారు బీజేపీ నేతలు. నిజంగానే ఆ సినిమా రిజల్ట్ కాస్త అటు ఇటు అయ్యే సరికి పండగ చేసుకుంటున్నారు.

"మా జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని, అడుగు వేసిన దేశ భక్తులకు ధన్యవాదాలు.. దేశంపై ద్వేషం, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత. హిందువులంటే చులకన భావంతో వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీసే ఆమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చద్దా ఇప్పుడు కూలబడి కుదేలైంది. దేశవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు అమీర్ నైజం తెలుసుకుని ఆయన సినిమాలంటే అసహ్యించుకుంటున్న నేపథ్యంలో ఏం జరగబోతోందో గ్రహించి.. కనీసం పెట్టుబడైనా తిరిగి తెచ్చుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల మీద.. విదేశీ మార్కెట్ మీదే ఆధారపడ్డారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్ పప్పులు ఉడకలేదు." అంటూ ట్వీట్ చేశారు బీజేపీ నేత విజయశాంతి.సినిమా విడుదలకు ముందు కూడా ఆమె అమీర్ ఖాన్ పై, ఆ సినిమాని తెలుగులో ప్రమోట్ చేసిన చిరంజీవి, నాగార్జునపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు సినిమా ఫ్లాపైందంటూ వారందరికీ చురకలంటించారు.

దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు లాల్ సింగ్ చద్దా ఫ్లాపవ్వాలని కోరుకున్నారు. భారత్‌లో పరిస్థితి బాగోలేదంటూ గతంలో స్టేట్‌మెంట్లు ఇచ్చిన కొంతమంది సెలబ్రిటీలలో అమీర్ ఖాన్ కూడా ఒకరు. అప్పట్లోనే ఆయనపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే అంతకు మించి వ్యతిరేకిస్తే, వారి ఆరోపణలే నిజమవుతాయనే భయంతో వెనక్కి తగ్గారు. అక్కడితో వారిని బీజేపీ నేతలు మరచిపోలేదని, వెంటాడి, వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఇప్పుడు అర్థమవుతోంది. అమీర్ ఖాన్ సినిమా ఫ్లాపయిందంటూ బీజేపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా విజయశాంతి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అమీర్ పాపం పండింది, కరీనా కపూర్ గర్వం దిగింది అంటూ ఆమె స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.

First Published:  14 Aug 2022 9:13 AM IST
Next Story