Telugu Global
National

ఇలాంటి తీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? - సుప్రీం కోర్టు తీరుపై ఉప రాష్ట్రపతి

రాజ్యాంగ నిబంధనలను కాదనే ఇలాంటి సామాంతర వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే ఉప రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి తీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? - సుప్రీం కోర్టు తీరుపై ఉప రాష్ట్రపతి
X

సుప్రీం కోర్టు వ్యవహారశైలిపై ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే ఉప రాష్ట్రపతి జగదీప్ ధ‌న్‌క‌ర్ అభ్యంతరం తెలిపారు. న్యాయమూర్తుల నియామకం కోసం కొలిజియం స్థానంలో నేషనల్ జడ్జీస్‌ అపాయింట్‌మెంట్ కమిషన్‌ ఏర్పాటుకు మోడీ సర్కార్ ప్రయత్నించగా సుప్రీంకోర్టు దాన్ని పక్కనపెట్టింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. పార్లమెంట్ చేసిన చట్టాలను కోర్టులు పక్కన పెట్టే ఘటనలు ప్రపంచంలో ఎక్కడా ఉండవని వ్యాఖ్యానించారు.

ఈ దేశంలో పార్లమెంట్‌ కంటే సుప్రీం ఎవరున్నారని ప్రశ్నించారు. ఎన్‌జేఏసీ చట్టానికి సుప్రీంకోర్టు అడ్డుపడటం ఒక ఎత్తయితే.. అందుకు పార్లమెంట్ నుంచి కనీసం ఒక్క ఎదురు మాట కూడా రాకపోవడం మరింత సమస్యగా మారిందన్నారు. చట్టాల్లోని లోటుపాట్లపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని.. అలా కాకుండా ఏకంగా చట్టాలనే పక్కన పెట్టేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా చేయవచ్చని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.

రాజ్యాంగ నిబంధనలను కాదనే ఇలాంటి సామాంతర వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే ఉప రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల కొలిజియం వ్యవస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కొలిజయం వ్యవస్థకు అడ్డుపడవద్దని సుప్రీంకోర్టు చెబుతోంది. కేంద్రం తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. న్యాయమూర్తులు కేసులపై దృష్టి పెట్టాలని.. అలా కాకుండా న్యాయమూర్తులుగా ఎవరిని నియమించాలన్న దానిపై న్యాయమూర్తులు దృష్టిసారిస్తే ఎలా అని ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా వ్యాఖ్యానించారు. ఏం చేసినా కేంద్రం చూస్తూ ఊరుకుంటుందని అనుకోవద్దని కూడా ఆ మధ్య వ్యాఖ్యానించారు.

First Published:  4 Dec 2022 3:13 AM GMT
Next Story