వందే భారత్ లో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్ లోని కుర్వాయి కేథోరా స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వందే భారత్ రైలులో ఓ బోగీకి మంటలు అంటుకున్నాయి.
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత రెండురోజులకు ఓసారి రైల్వేకి సంబంధించిన చిన్న, పెద్ద దుర్ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. ఆమధ్య చెన్నై రైల్వే స్టేషన్ వద్ద రైలు మంటల్లో చిక్కుకోగా, ఇదే నెలలో తెలంగాణలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ అగ్ని ప్రమాదంలో మూడు బోగీలు కాలి బూడిదయ్యాయి. తాజాగా వందేభారత్ కు మంటలు అంటుకున్నాయి. ప్రాణ నష్టం లేదు కానీ, ఆ రైలు దిగి ప్రయాణికులు పరుగులందుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు.
VIDEO | A fire broke out in a coach of Vande Bharat Express going from Bhopal to Delhi's Hazrat Nizamuddin Terminal at Kurwai Kethora railway station in Madhya Pradesh earlier today. No injury was reported in the incident.
— Press Trust of India (@PTI_News) July 17, 2023
(Source: Third Party) pic.twitter.com/m1Nj0mHJ46
ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్ లోని కుర్వాయి కేథోరా స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వందే భారత్ రైలులో ఓ బోగీకి మంటలు అంటుకున్నాయి. కోచ్ కింద అమర్చిన బ్యాటరీ బాక్స్ లో మంటలు చెలరేగాయి. వెంటనే రైలుని నిలిపివేశారు లోకో పైలట్. అగ్నిమాపకదళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించామని.. లోకో పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
వందే భారత్ రైలు ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు వరకు ఏదో ఒక రకంగా వార్తల్లోకెక్కుతోంది. వందే భారత్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆవులు, ఎద్దులు ట్రైన్ కి అడ్డం పడటం, వాటిని ఢీకొని రైలు ఆగిపోవడం చూశాం. దానితోపాటు రాళ్లదాడి కూడా రివాజుగా మారింది. ఇప్పుడు వందేభారత్ కి మంటలు కూడా అంటుకున్నాయి.