Telugu Global
National

వడగళ్ల వానతో డ్యామేజీ.. వందే భారత్ పై ఈసారి ప్రకృతి ప్రకోపం

గతంలో వడగళ్ల వానతో రైళ్ల అద్దాలు పగిలిన ఉదాహరణలు ఎప్పుడూ లేవు. కానీ వందే భారత్ అద్దాలు మాత్రం వడగళ్ల వానతో దెబ్బతిన్నాయి.

వడగళ్ల వానతో డ్యామేజీ.. వందే భారత్ పై ఈసారి ప్రకృతి ప్రకోపం
X

వందే భారత్ రైలుని ఏ మహూర్తాన ప్రారంభించారో కానీ అన్నీ అవాంతరాలు, అపశకునాలే. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రారంభించిన తొలినాళ్లలో పట్టాలపై పశువుల్ని ఢీకొని ఆగిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఆ తర్వాత రాళ్లదాడి ప్రముఖంగా నిలిచింది. అక్కడ, ఇక్కడ అని కాదు, కొత్త రైలు ప్రారంభించిన ప్రతిసారీ రాళ్లదాడి కామన్ గా జరిగేది. ఇక సాంకేతిక ఇబ్బందుల సంగతి సరేసరి. తాజాగా ప్రకృతి కూడా వందేభారత్ పై పగబట్టిందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

గతంలో వడగళ్ల వానతో రైళ్ల అద్దాలు పగిలిన ఉదాహరణలు ఎప్పుడూ లేవు. కానీ వందే భారత్ అద్దాలు మాత్రం వడగళ్ల వానతో దెబ్బతిన్నాయి. దానికి పిడుగుపాటు కూడా తోడయింది. ఒడిశాలో ఇటీవలే ప్రారంభించిన పూరీ-హౌరా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వడగళ్ల వానతో దెబ్బతిన్నది. రైలు భద్రాక్‌ రైల్వే స్టేషన్‌ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. సమీపంలో పిడుగు పడింది. ఆ దెబ్బకు డ్రైవర్‌ క్యాబిన్‌ విండ్‌ స్క్రీన్‌, సైడ్‌ విండోలు పగుళ్లు వచ్చాయి. ప్రయాణికులెవరికీ ఇబ్బంది కలగలేదు కానీ అద్దాలు పగుళ్లిచ్చే సరికి అందరూ ఆందోళనకు గురయ్యారు.


అక్కడితో ప్రమాదం పరిసమాప్తం అయిందనుకుంటే పొరపాటే.. ఆ తర్వాత ఓవర్‌ హెడ్‌ ఎలక్ట్రిక్‌ వైర్‌ తెగిపోవడంతో వైతరణి రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద అదే రైలు 2 గంటలసేపు పట్టాలపై ఆగిపోయింది. రైలులో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఓ డీజిల్‌ ఇంజిన్‌ ను అక్కడికి పంపించి రైలును తరలించారు. మరమ్మత్తుల నేపథ్యంలో.. ఈరోజు ఆ సర్వీసు రద్దు చేశారు. గత వారం మోదీ వర్చువల్ గా ఈ రైలుని ప్రారంభించారు. ఈ వారం ప్రమాదానికి గురై రైలు నిలిచిపోయింది.

First Published:  22 May 2023 1:47 PM IST
Next Story