Telugu Global
National

వందే భారత్ స్పీడ్ 'వంద' కూడా లేదు.. ఆర్టీఐ సమాచారంలో విస్తుపోయే నిజాలు!

ఇండియన్ రైల్వేస్‌కు సంబంధించిన కమర్షియల్ సర్వీసుల అత్యధిక వేగం సగటున గంటకు 130 కిలోమీటర్లుగా ఉంది. అయితే, వందేభారత్ రైళ్లు కనీసం ఈ వేగాన్ని కూడా అందుకోలేక పోతున్నట్లు తెలిసింది.

వందే భారత్ స్పీడ్ వంద కూడా లేదు.. ఆర్టీఐ సమాచారంలో విస్తుపోయే నిజాలు!
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వందే భారత్ రైలుకు సంబంధించిన ప్రచారం భారీగా చేస్తోంది. ప్రతీ రైలు ఓపెనింగ్‌కు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ సెమీ సూపర్ ఫాస్ట్ రైలును ప్రవేశపెట్టినట్లు రైల్వే శాఖ తెలియజేసింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు నడుస్తాయని ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయి వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. వందే భారత్ రైళ్ల సగటు వేగం 83 కిలోమీటర్లే అని స్పష్టమైంది.

ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్‌కు సంబంధించిన కమర్షియల్ సర్వీసుల అత్యధిక వేగం సగటున గంటకు 130 కిలోమీటర్లుగా ఉంది. అయితే, వందేభారత్ రైళ్లు కనీసం ఈ వేగాన్ని కూడా అందుకోలేక పోతున్నట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా వందే భారత్ రైళ్ల సగటు వేగం ఎంతో ప్రశ్నించారు. కాగా, 2021-22లో గంటకు 84.48 కిలోమీటర్లు, 2022-23లో గంటకు 81.38 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించినట్లు సమాచారం ఇచ్చారు.

వందేభారత్ రైళ్లు దేశంలో ప్రస్తుతం అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లు అని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా అబద్దమేనని తేలింది. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ రైళ్లను రూపొందిస్తోంది. వాటిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారు చేస్తున్నారు. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగం వరకు ఈ రైళ్లు ప్రయాణించగలుగుతాయని ఐసీఎఫ్ పేర్కొంది. కానీ, వాస్తవానికి ఈ రైళ్లు వంద కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోలేక పోతున్నట్లు స్వయంగా రైల్వే శాఖ చెప్పడం గమనార్హం.

రైల్వే ట్రాక్‌లు పటిష్టంగా లేకపోవడం వల్లే అత్యధిక వేగంతో వందేభారత్‌లను నడిపించడం లేదని అధికారులు అంటున్నారు. అదే సమయంలో ఇతర కమర్షియల్ రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో అదే ట్రాక్‌పై వెళ్తుండటం గమనార్హం. కనీసం ఆ వేగంతో అయినా రైళ్లను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

2019లో ప్రారంభమైన న్యూఢిల్లీ-వారణాసి వందేభారత్ రైలు సగటున 95 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఇదే అత్యధిక వేగంతో ప్రయాణించే వందేభారత్ కావడం గమనార్హం. ఇక ముంబై సీఎస్టీ నుంచి సాయినగర్ షిర్డీ మధ్య నడిచే వందేభారత్ సగటున 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. కాగా.. రాజధాని, శతాబ్ధి రైళ్ల సగటు వేగం కంటే వందే భారత్ రైళ్ల వేగం మెరుగ్గా ఉందని ఆర్టీఐ సమాచారంలో పేర్కొన్నారు.

First Published:  22 April 2023 2:13 PM IST
Next Story