Telugu Global
National

వందే భారత్ కు శాశ్వత బ్రేక్.. ఆ రూట్లో రైలు రద్దు

అధిక టికెట్ ధరల కారణంగా, ఈ రూట్లో వందే భారత్ ఆక్యుపెన్సీ పడిపోయింది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత రెండురోజులపాటు కొంతమంది ఔత్సాహికులు వందే భారత్ ఎక్కారు. ఆ తర్వాత అవసరం లేదనుకున్నారు. దీంతో రైలుని రద్దు చేశారు అధికారులు.

వందే భారత్ కు శాశ్వత బ్రేక్.. ఆ రూట్లో రైలు రద్దు
X

ప్రధాని మోదీ ఎంతో గొప్పగా జెండా ఊపి ప్రారంభిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు అక్కడక్కడా అవాంతరాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. పశువుల్ని ఢీకొని కొన్నిసార్లు, అద్దాలు పగిలి కొన్నిసార్లు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఈ తాత్కాలిక బ్రేక్ ల సంగతి పక్కనపెడితే ఇప్పుడు ఓ రూట్లో వందే భారత్ కి పర్మినెంట్ గా బ్రేక్ వేశారు అధికారులు. ఆ రైలుని రద్దు చేశారు.

స్పందన కరువు..

వందే భారత్ ప్రయాణానికి ఎక్కడలేని డిమాండ్ ఉంది, బోగీలు పెంచాం, సర్వీసులు పెంచుతున్నామంటూ కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్నా కొన్ని చోట్ల మాత్రం అసలు వందే భారత్ గిరాకీలేని బండిగా మారిపోయింది. ఊహించని భారీ చార్జీలతో ప్రయాణికులు అటువైపే చూడటంలేదు. దీంతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి ఛత్తీస్‌ గఢ్ లోని బిలాస్‌ పూర్ వరకు ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ ప్రెస్‌ ని రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ ట్రైన్ ని ఇకపై నడపబోమని తేల్చి చెప్పింది.

సరైన అక్యుపెన్సీ లేని కారణంగా నాగ్ పూర్ - బిలాస్ పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలుని ఆపేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలుని రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వేస్‌ ప్రకటించింది. రైల్వే శాఖ ఆశించినమేర ప్యాసింజర్లు వందే భారత్‌లో ప్రయాణించేందుకు మొగ్గు చూపడం లేదని తెలిపింది. దీని స్థానంలో తేజస్ ఎక్స్‌ప్రెస్ నడుపుతామని తెలిపింది.

గతేడాది డిసెంబర్‌ లో నాగ్‌ పూర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని ప్రారంభించారు. నాగ్‌ పూర్ నుంచి బిలాస్‌ పూర్‌ కు ప్రయాణ సమయాన్ని ఏడెనిమిది గంటలనుంచి ఐదున్నర గంటలకు తగ్గించామని ఘనంగా ప్రకటించారు. అయితే, అధిక టికెట్ ధరల కారణంగా, ఈ రూట్లో వందే భారత్ ఆక్యుపెన్సీ పడిపోయింది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత రెండురోజులపాటు కొంతమంది ఔత్సాహికులు వందే భారత్ ఎక్కారు. ఆ తర్వాత అవసరం లేదనుకున్నారు. దీంతో రైలుని రద్దు చేశారు అధికారులు.

First Published:  17 May 2023 11:32 AM IST
Next Story