గంగమ్మ ఉగ్ర రూపం.. ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం
దేవప్రయాగ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డాయి
యమునా నది ఆగ్రహం ఇంకా తగ్గలేదు, ఢిల్లీకి పూర్తి స్థాయిలో ముంపు ముప్పు తొలగిపోలేదు. ఇప్పుడు గంగమ్మ కూడా యమునకు తోడయింది. గంగానది వరదలతో ఉత్తరాఖండ్ లో జలవిలయం తప్పదని తేలిపోయింది. భారీ వర్షాలు ఉత్తరాదిని వదిలిపెట్టకపోవడంతో గంగా నది వరదనీటితో పోటెత్తుతోంది.
భారీ వర్షాలతో అలకనంద నదిపై ఉన్న జీవీకే హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్ పూర్తిగా నిండటంతో దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో దేవప్రయాగ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. హరిద్వార్ లో గంగానది హెచ్చరిక స్థాయి ప్రవాహం 293 మీటర్లు కాగా.. ఇప్పటికే 295 మీటర్లు దాటి ఉరకలెత్తుతోంది గంగ. గంగా పరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాస శిబిరాలకు తరలించారు. హరిద్వార్, రూర్కీ, ఖాన్ పూర్, భగవాన్ పూర్, లస్కర్ పరిధిలోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరింది.
ఉత్తరాఖండ్ లో జలవిలయం..
భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక చోట్ల రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా 17 రోడ్లు, 9వంతెనలు దెబ్బతిన్నాయి. ఉత్తరాఖండ్ లోని 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు యమునా నది ప్రవాహం ఇంకా ప్రమాదకర స్థాయి పైనే ఉంది. ఈరోజు ఉదయం 8 గంటల సమయానికి యమున నీటిమట్టం 205.50 మీటర్లుగా నమోదైంది. భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో యమునలో ప్రవాహం మరింత పెరుగుతుందని అంటున్నారు అధికారులు. ఢిల్లీలోని ఎర్రకోట, రాజ్ ఘాట్ తదితర ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచే ఉంది.