రిసార్ట్ లో 19 ఏళ్ళ యువతి హత్య కేసులో బిజెపి నేత కొడుకు అరెస్ట్
భారతీయ జనతా పార్టీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య తన రిసార్ట్ లో రిసప్షనిస్ట్ గా పని చేస్తున్న 19 ఏళ్ళ యువతిని హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. వినోద్ ఆర్య రాష్ట్ర అధికార పార్టీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవాడు కాబట్టి పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ సీనియర్ బిజెపి నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యను హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పౌరీ జిల్లాలోని రిషికేశ్ సమీపంలోని రిసార్ట్‌లో అంకిత భండారి (19) అనే యువతి రిసెప్షనిస్ట్ గా పని చేస్తున్నారు. ఈ రిసార్ట్ పుల్కిత్ ఆర్యకు చెందినది. ఆమె సోమవారంనుంచి కనిపించడంలేదని కుటుంబ సభ్యులతో పాటు ఆర్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుల్కిత్ దర్యాప్తునకు సహకరించడంలేదని, ఆయనకు ఈ నేరంతో సంబంధం ఉందని బాధితురాలి తలిదండ్రులు ఆరోపించారు. అయితే ఆర్య తో పాటు మరో ఇద్దరు కలిసి ఆ రిసెప్షనిస్ట్ ను హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు.
కాగా యువతిని హత్య చేశారని తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో రిసార్ట్ కు నిప్పు పెట్టారు. కిటికీల అద్దాలు పగల గొట్టారు. ఇదిలా ఉండగా, రిసార్ట్‌లోని కొన్ని భాగాలను స్థానిక అధికారులు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాల మేరకు ఆ రిసార్ట్ ను రాత్రికి రాత్రే కూలగొట్టారు.
ఈ ఉదయం సమీపంలోని కాలువ నుంచి ఆ మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. "నిందితుడి తండ్రి వినోద్ ఆర్య రాష్ట్ర అధికార పార్టీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవాడు కాబట్టి పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినోద్ ఆర్య ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేకుండా రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నారు. పోలీసులు నిందితులకు టీ కాఫీలు ఇచ్చి బాధిత కుటుంబానికి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని స్థానికులు పోలీసుల తీరును విమర్శించారు.
స్థానిక మీడియా బాలిక అదృశ్యంపై వరసగా కథనాలు ఇవ్వడంతోనే పోలీసులల్లో కదలిక వచ్చిందని స్తానికులు బెబుతున్నారు. అయితే తాము నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలిని వ్యభిచారం చేయాలని బలవంతం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కానీ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు.
ఇదిలా ఉండగా, అంకిత వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో కాల్ రికార్డింగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఒక అమ్మాయి రిసార్ట్ సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు ఏడుపు వినిపించింది., తనను తీసుకుపోవాలని కోరింది. సహోద్యోగితో ఆమె వాట్సాప్ చాట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, దీనిలో పుల్కిత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తాను అతనిని అడ్డుకున్నానని ఆమె చెప్పడం ఉందంటున్నారు.