Telugu Global
National

డీఎస్పీకి కానిస్టేబుల్‌గా డిమోషన్‌ – మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధమే కారణం

మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం ఆ అధికారి పదవికే ఎసరు పెట్టింది. డీఎస్పీ స్థాయిలో ఉన్న అతన్ని కానిస్టేబుల్‌ స్థాయికి డిమోట్‌ చేస్తూ పోలీసు శాఖ చర్యలు తీసుకుంది.

Representational image
X

Representational image

మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం ఆ అధికారి పదవికే ఎసరు పెట్టింది. డీఎస్పీ స్థాయిలో ఉన్న అతన్ని కానిస్టేబుల్‌ స్థాయికి డిమోట్‌ చేస్తూ పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. క్రిపా శంకర్‌ కనౌజియా కానిస్టేబుల్‌గా కెరీర్‌ మొదలుపెట్టాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ స్థాయికి చేరుకున్నాడు. కానీ, మూడేళ్ల క్రితం ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే.. అతన్ని పోలీసు అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో అతని గుట్టు రట్టయింది.

ఉన్నావ్‌లో అతను సర్కిల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కారణాలు చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లడానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలసి కాన్పూర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అనంతరం తన అధికారిక, వ్యక్తిగత ఫోన్లను స్విచ్చాఫ్‌ చేశాడు. ఆ తర్వాత అతని భార్య అతని ఫోన్‌కి కాల్‌ చేయగా, స్విచ్చాఫ్‌ చేసి ఉంది. అధికారిక ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసి ఉండటంతో ఆమె ఆందోళనతో ఉన్నావ్‌ ఎస్పీని సంప్రదించారు.

దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాన్పూర్‌లోని హోటల్లో చివరిసారి అతడి ఫోన్‌ లొకేషన్‌ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకోగా.. కనౌజియా మహిళా కానిస్టేబుల్‌తో పాటు అక్కడే ఉండటాన్ని గుర్తించి ఇద్దరినీ పట్టుకున్నారు. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించిన అప్పటి లఖ్‌నవూ రేంజ్‌ ఐజీపీ దీనిపై విచారణకు ఆదేశించారు. క్రమశిక్షణారాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దీనిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన పోలీసులు.. అతన్ని గోరఖ్‌పూర్‌ బెటాలియన్‌లోని ‘ప్రొవిన్షియల్‌ ఆర్ముడ్‌ కానిస్టేబులరీ’లో కానిస్టేబుల్‌గా డిమోట్‌ చేశారు. దీంతో కష్టపడి అంచెలంచెలుగా డీఎస్పీ స్థాయికి ఎదిగిన అతను ఒక్కసారిగా కెరీర్‌ మొదలుపెట్టిన చోటికే తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

First Published:  23 Jun 2024 11:25 AM IST
Next Story