Telugu Global
National

అన్ని ర‌కాల ట్రాఫిక్ చ‌లాన్లు ర‌ద్దు

పదే పదే ట్రాఫిక్ చలాన్లు విధిస్తుంటే.. వాటిని కట్టేదెలా..? అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయం ముఖ్యమంత్రి యోగి దృష్టికి వెళ్ళింది.

అన్ని ర‌కాల ట్రాఫిక్ చ‌లాన్లు ర‌ద్దు
X

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మ‌రో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో వాహనాలపై నమోదైన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో ఉత్తరప్రదేశ్‌లో లక్షలాదిమంది వాహనదారులకు ఊరట లభించింది. గతంలో పోలీసులు కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ రోడ్లపై నేరుగా వాహనాలను ఆపి హెల్మెట్ లేకున్నా, సరైన ధ్రువపత్రాలు లేకపోయినా జరిమానా విధించేవారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ పద్ధతిలోనే నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వాహ‌న‌దారుల‌కు జ‌రిమానాలు విధిస్తున్నారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణించినా, వాహనాన్ని నో పార్కింగ్ జోన్‌లో నిలిపినా, ఓవర్ స్పీడ్ తో ప్రయాణించినా, త్రిబుల్ డ్రైవ్, సిగ్నల్ జంప్ వంటి వాటికి సంబంధించి రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఫొటోలు తీస్తుండగా.. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి ఇందుకు సంబంధించిన ఫైన్లను నేరుగా వాహనదారుల ఇళ్లకు పంపిస్తున్నారు. అయితే ఈ చలాన్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒక్కోసారి తమ తప్పు లేకపోయినా జరిమానా విధించినట్లు నోటీసులు వస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు.

ఇదిలా ఉండగా.. వాహనాలకు విధించిన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని ఇటీవల నోయిడాలో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. చిన్నచిన్న కారణాలు చూపి అధికారులు పదే పదే ట్రాఫిక్ చలాన్లు విధిస్తుంటే.. వాటిని కట్టేదెలా..? అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయం ముఖ్యమంత్రి యోగి దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలం నుంచి నమోదైన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.

ఉత్తర ప్రదేశ్ లోని అన్ని రకాల ట్రాఫిక్ చలాన్లను జనవరి 1, 2017 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చలాన్లు నమోదు చేసి కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న వాహనాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాదిమంది వాహనదారులకు ఊరట లభించింది. యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో చలాన్లకు సంబంధించిన కోట్లాది రూపాయల పెండింగ్ బిల్లులు మాఫీ అయ్యాయి.

First Published:  10 Jun 2023 7:04 AM GMT
Next Story