Telugu Global
National

ఆరుగురు పోలీసుల‌కు జైలు శిక్ష విధించిన స్పీక‌ర్‌.. - ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో విచిత్రం

సంబంధిత పోలీసుల‌ను శుక్ర‌వారం శాస‌న‌స‌భ‌కు పిలిపించారు. ఈ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రి సురేష్‌కుమార్ మాట్లాడుతూ సంబంధిత పోలీసుల‌కు జైలు శిక్ష విధించాల‌ని ప్ర‌తిపాదించారు.

ఆరుగురు పోలీసుల‌కు జైలు శిక్ష విధించిన స్పీక‌ర్‌.. - ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో విచిత్రం
X

ఉత్త‌రప్ర‌దేశ్ అసెంబ్లీలో విచిత్రం చోటుచేసుకుంది. చ‌ట్టాలు చేసే శాస‌న‌స‌భ శుక్ర‌వారం న్యాయ‌స్థానంగా మారింది. ఆరుగురు పోలీసుల‌కు శాస‌న‌స‌భ స్పీక‌ర్ జైలు శిక్ష విధించారు. 19 ఏళ్ల క్రితం ఓ ఎమ్మెల్యేపై అభ్యంత‌క‌రంగా వ్య‌వ‌హ‌రించిన నేరానికి గాను వారికి ఈ శిక్ష విధిస్తూ ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి...

2004లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న స‌లీల్ విష్ణోయ్‌, ఆయ‌న మ‌ద్ద‌తుదారుల‌పై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిపై ఆయ‌న అప్ప‌ట్లోనే స‌భా హ‌క్కుల క‌మిటీకి ఫిర్యాదు చేశారు. విచార‌ణ జ‌రిపిన క‌మిటీ ఆ ఆరుగురు పోలీసుల‌కు శిక్ష విధించాల‌ని సోమ‌వారం సిఫార్సు చేసింది.

దీంతో సంబంధిత పోలీసుల‌ను శుక్ర‌వారం శాస‌న‌స‌భ‌కు పిలిపించారు. ఈ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రి సురేష్‌కుమార్ మాట్లాడుతూ సంబంధిత పోలీసుల‌కు జైలు శిక్ష విధించాల‌ని ప్ర‌తిపాదించారు. దీనిపై నిర్ణ‌యాధికారం స్పీక‌ర్‌దేన‌ని కాంగ్రెస్‌, బీఎస్పీ స‌హా వివిధ పార్టీల నేత‌లు స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు స్పీక‌ర్ స‌తీశ్ మ‌హానా తీర్పు వెలువరించారు.

ఈ పోలీసు సిబ్బంది ల‌క్ష్మ‌ణ రేఖ‌ను అతిక్ర‌మించార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పారు. శాస‌న‌స‌భ ప్రాంగ‌ణంలోని ఒక గ‌దిని కారాగారంగా ప‌రిగ‌ణిస్తూ.. అందులో ఒక‌రోజు వారిని నిర్బంధించాల‌ని ఆదేశించారు. శుక్ర‌వారం రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వారిని అక్క‌డే ఉంచాల‌ని చెప్పారు. అయితే ఆ పోలీసుల‌ను బాగా చూసుకోవాల‌ని, ఆహారం, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించాల‌ని సూచించారు.

లాఠీచార్జి జ‌రిగిన‌ప్పుడు అధికారంలో ఉన్న స‌మాజ్ వాదీ పార్టీ, దాని మిత్ర‌ప‌క్షం రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ స‌భ్యులు తాజా తీర్పు వెలువ‌డే స‌మ‌యంలో స‌భ‌లో లేరు. అప్ప‌టి ఎమ్మెల్యే స‌లీల్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు.

First Published:  4 March 2023 11:15 AM IST
Next Story