Telugu Global
National

ప్రమాదంలో మత స్వేచ్ఛ.. భారత్ పై చెరిపేసుకోలేని నింద

సీబీఐ, ఈడీ, ఐటీ.. వంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తున్న కేంద్రం.. విదేశీ సంస్థల దగ్గర ఉన్న సమాచారాన్ని అడ్డుకోలేకపోయింది.

ప్రమాదంలో మత స్వేచ్ఛ.. భారత్ పై చెరిపేసుకోలేని నింద
X

భారత్ లో మత స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. ఇదేదో ఇక్కడి ప్రతిపక్షాల విమర్శ కాదు. అమెరికాలోని యూఎస్‌ కమిషన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌ (USCIRF) బయటపెట్టిన నివేదిక సారాంశం. అవును, భారత్ లో మత స్వేచ్ఛ ఎంత దారుణ పరిస్థితుల్లో ఉందో అమెరికాలోని సంస్థలు పసిగట్టేశాయి. అంతే కాదు, భారత్ పై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ఆంక్షల వల్ల భారత్ లో పరిస్థితులు మారిపోతాయని కాదు, కనీసం ఇక్కడి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందనేది USCIRF ఆలోచన. అందుకే కొన్ని భారత ప్రభుత్వ సంస్థలు, అధికారులపై ఆంక్షలు విధించాలని బైడెన్‌ ప్రభుత్వానికి సూచించింది.

భారత్‌ లో మతస్వేచ్ఛ పతనమవడం 2022లో కూడా కొనసాగిందని USCIRF పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తమ స్థాయిలో మతవివక్షను పెంచే చర్యలకు పూనుకొన్నాయని నిందలేసింది. ఇవి నిందలే అని అనుకోడానికి లేదు. ఎందుకంటే భారత్ లో ప్రస్తుతం అలాంటి పరిస్థితులే ఉన్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సీబీఐ, ఈడీ, ఐటీ.. వంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తున్న కేంద్రం.. విదేశీ సంస్థల దగ్గర ఉన్న సమాచారాన్ని అడ్డుకోలేకపోయింది.

మతమార్పిడి నిరోధక చట్టాలు, మతాంతర వివాహాలకు అడ్డుకట్ట వేయడం, హిజాబ్‌ పై నిషేధం, గోవధ విషయంలో కఠిన ఆంక్షలు.. వంటి అంశాల్లో ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, దళితులు, ఆదివాసీలకు నష్టం చేకూర్చేలా భారత్ లో విధి విధానాలున్నాయని USCIRF చెబుతోంది. మైనార్టీలను UAPA చట్టాల కింద అరెస్ట్ చేస్తున్నారని, వీటిని మతపరమైన దాడులుగా పేర్కొనాలని, మత స్వేచ్ఛను హరించివేసే ప్రయత్నమే ఇదని అంటోంది. అయితే USCIRF సూచనలను అమెరికా ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఆ సంస్థ లేవనెత్తిన విషయాలు మాత్రం తీవ్ర కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయ సమాజంలో భారత్ ని దోషిగా నిలబెడుతున్నాయి.

First Published:  3 May 2023 5:43 AM GMT
Next Story