భారత్‌పైనా చైనా నిఘా బెలూన్లు..! - సైనిక సమాచారం సేకరణే డ్రాగన్ లక్ష్యం..!
చైనా నిఘా బెలూన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారత్ సహా మిత్ర దేశాలను అమెరికా భద్రతా అధికారులు హెచ్చరించారు.
అమెరికా గగనతలంపై ఎగురుతూ కనిపించిన చైనా నిఘా బెలూన్లు ఆ దేశ రక్షణ వ్యవస్థలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అమెరికా ఆ బెలూన్లను యుద్ధ విమానాల ద్వారా కూల్చేసిన విషయం తెలిసిందే. అమెరికాపైనే కాకుండా భారత్‌తో పాటు మరిన్ని దేశాలను కూడా లక్ష్యంగా చేసుకొని చైనా సర్వైలెన్స్ బెలూన్లను ప్రయోగించిందని తెలుస్తోంది. వాటి ద్వారా ఆయా దేశాల ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసిందని సమాచారం.
భారత్‌తో పాటు జపాన్, తైవాన్, వియత్నాం, ఫిలిప్పైన్స్ సహా పలు దేశాల సైనిక సమాచారాన్నిసేకరించే ప్రయత్నం జరిగిందని ప్రముఖ వార్తా ప్రచురణ సంస్థ వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంటోంది. దీనికి సంబంధించి పలువురు నిఘా అధికారులు, భద్రతా విభాగానికి చెందిన ప్రముఖుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ కథనాన్ని ప్రచురించింది.
దీనికితోడు అమెరికా భద్రతా అధికారులు భారత్ సహా మిత్ర దేశాలను చైనా నిఘా బెలూన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్లను కూల్చివేసిన సమాచారం.. అట్లాంటిక్ మహా సముద్రం నుంచి ఆ బెలూన్ల శకలాలను సేకరించిన సమాచారాన్ని మిత్ర దేశాలకు అమెరికా నివేదించింది. ఈ వ్యవహారంపై అమెరికాకు చెందిన పెంటగాన్ అధికారులు గత మూడు రోజులుగా 40 మిత్ర దేశాలకు చెందిన భద్రతా ప్రతినిధులు, దౌత్యవేత్తలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. భారత గగనతలంపై చైనా నిఘా బెలూన్ల వ్యవహారంపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.