Telugu Global
National

ఢిల్లీలో 13 కోచింగ్‌ సెంటర్లకు సీల్‌ – సివిల్స్‌ అభ్యర్థుల మృతి ఘటనతో అధికారుల చర్యలు

అక్రమంగా నిర్వహిస్తున్న 13 కోచింగ్‌ సెంటర్లకు ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సీల్‌ వేశారు.

ఢిల్లీలో 13 కోచింగ్‌ సెంటర్లకు సీల్‌ – సివిల్స్‌ అభ్యర్థుల మృతి ఘటనతో అధికారుల చర్యలు
X

ఢిల్లీలోని పాత రాజేంద్రనగర్‌లో గల ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌లో ముగ్గురు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చట్టవిరుద్ధంగా కోచింగ్‌ సెంటర్లు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్టడీ సెంటర్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు సదరు కోచింగ్‌ సెంటర్‌లో సెల్లార్‌ను నిబంధనలకు విరుద్ధంగా గ్రంథాలయంగా వాడుతున్నారని గుర్తించారు. పార్కింగ్, స్టోర్‌ రూమ్‌గా వాడతామని బిల్డింగ్‌ ప్లాన్‌లో చూపించి గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారని గుర్తించి కోచింగ్‌ సెంటర్‌కి సీల్‌ వేశారు.

ఈ క్రమంలోనే ఢిల్లీలో అక్రమంగా నడిపిస్తున్న కోచింగ్‌ సెంటర్లపై మున్సిపల్‌ అధికారులు దృష్టి సారించారు. అక్రమంగా నిర్వహిస్తున్న 13 కోచింగ్‌ సెంటర్లకు ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సీల్‌ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్‌ సెంటర్లు నిర్వహించడం వల్లే చర్యలు తీసుకున్నట్టు వారు వెల్లడించారు. రావూస్‌ స్టడీ సర్కిల్‌లో జరిగిన ప్రమాదంలో వరద నీరు అకస్మాత్తుగా భవనం బేస్‌మెంట్‌లోకి ప్రవహించడంతో అక్కడి గ్రంథాలయంలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు తానియా సోని, శ్రేయా యాదవ్, నవీన్‌ డెల్విన్‌ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది కూడా ఆ సమయంలో గ్రంథాలయంలో ఉన్నప్పటికీ వారంతా వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి బయటపడ్డారు.

First Published:  29 July 2024 1:15 AM GMT
Next Story