Telugu Global
National

యోగి కేబినెట్‌లో చిచ్చు.. ఒకరు రాజీనామా, మరొకరు అలక..

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు వంద రోజులుగా ఎలాంటి పనులు అప్పగించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు తెలియకుండా తన శాఖలో చాలా పనులు జరుగుతున్నాయని, భారీగా అవినీతి జరుగుతోందని అంటున్నారు ఖటిక్.

యోగి కేబినెట్‌లో చిచ్చు.. ఒకరు రాజీనామా, మరొకరు అలక..
X

వరుసగా రెండోసారి సీఎంగా ఎన్నికైన తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎంతగా అంటే సొంత పార్టీ నేతలే తట్టుకోలేనంతగా.. కేబినెట్ మినిస్టర్లే రాజీనామా చేసేంతలా. అవును, యోగి కేబినెట్‌లో జలవనరుల శాఖ మంత్రి దినేష్ ఖటిక్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి కూడా పంపారు. యోగి నిరంకుశ విధానాల వల్లే తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు దినేష్ ఖటిక్.

దళితుడినని అవమానించారు..

తాను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే సీఎం యోగి తనను అవమానిస్తున్నారని, తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు దినేష్ ఖటిక్. మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేవని, తాను మంత్రిగా పనిచేయడం వల్ల దళిత వర్గానికి ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారాయన. తనను సమావేశాలకు పిలవడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు వంద రోజులుగా ఎలాంటి పనులు అప్పగించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు తెలియకుండా తన శాఖలో చాలా పనులు జరుగుతున్నాయని, భారీగా అవినీతి జరుగుతోందని అంటున్నారు ఖటిక్.

జితిన్ ప్రసాద అసంతృప్తి..

ఆ మధ్య యోగికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నుంచి జితిన్ ప్రసాదను తీసుకొచ్చింది బీజేపీ అధిష్టానం. ఓ దశలో జితిన్ కు కీలక పదవి అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ యోగినే తిరిగి సీఎంగా కొనసాగిస్తూ ఎన్నికలను ఎదుర్కొన్నారు. యోగి బలం పుంజుకోవడంతో జితిన్ ప్రసాద అనుకోకుండా ఆయనకు టార్గెట్ అయ్యారు. జితిన్ ప్రసాద పబ్లిక్ వర్క్స్ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖలో ఇటీవలే ఐదుగురు సీనియర్ అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జితిన్ ప్రసాద కోర్ టీమ్ లోని అధికారిపై కూడా అవినీతి ఆరోపణలు చేస్తూ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఇదంతా జితిన్ ప్రసాదకు తెలియకుండానే జరిగింది. తనను సంప్రదించకుండానే తన శాఖ విషయంలో న్యాయ విచారణ చేపట్టడం, అధికారుల్ని సస్పెండ్ చేయడంపై జితిన్ ప్రసాద అసంతృప్తితో ఉన్నారు. రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద యోగి కేబినెట్ లో ఒక్కసారిగా బాంబు పేలింది. దళిత మంత్రి రాజీనామా చేయడం, మరొకరు రాజీనామా చేస్తానంటూ హెచ్చరించడం చూస్తుంటే.. అధిష్టానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోక తప్పేలా లేదనిపిస్తోంది.

First Published:  20 July 2022 5:06 PM IST
Next Story