కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన మైనర్.. ఆలస్యంగా నిందితుడి అరెస్టు
నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని తాజాగా కాన్పూర్ అదనపు పోలీస్ కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు. మైనర్ బాలుడు కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలినట్లు చెప్పారు.
ఇటీవల పూణేలో ఓ మైనర్ బాలుడు లగ్జరీ కారు నడిపి ఇద్దరు యువకుల మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆరు నెలల తర్వాత నిందితుడు అరెస్టు అయ్యాడు. కాన్పూర్ కు చెందిన ప్రముఖ వైద్యుడి మైనర్ కుమారుడు 2023 అక్టోబర్‌లో కారుతో ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. అంతేకాదు 2023 మార్చిలో కూడా ఈ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా కారును నడిపి నలుగురిని గాయపరిచాడు. ఈ రెండు ఘటనల్లో మైనర్ బాలుడు ప్రాథమికంగా దోషి అయినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఉన్నతాధికారులకు సమాచారం అందింది.
ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని తాజాగా కాన్పూర్ అదనపు పోలీస్ కమిషనర్ హరీష్ చందర్ తెలిపారు. మైనర్ బాలుడు కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. దీంతో ఈ ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడిని జువైనల్ హోమ్ కి తరలించారు.
ఈ రెండు ప్రమాదాలకు సంబంధించి మైనర్ బాలుడిపై, అతడి తండ్రిపై చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు. పూణేలో మద్యం సేవించి కారు నడిపి ఇద్దరు మృతికి కారణమైనప్పటికీ మైనర్ బాలుడికి 15 గంటల్లోనే బెయిల్ వచ్చింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే కాన్పూర్ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.