యూపీలో రోడ్డెక్కిన ఉద్యోగులు.. యోగిపై సోషల్ మీడియాలో జోకులు..
అక్కడ క్షేత్రస్థాయి వాస్తవం వేరు. రాష్ట్ర జల్ నిగమ్ ఉద్యోగులకు 6 నెలలుగా జీతాల్లేవు. 20వేలమంది ఉద్యోగులు జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. ఇదీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీలోని దారుణ పరిస్థితి.
డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు పెడుతుందని పదే పదే ప్రధాని మోదీ ఊదరగొడుతుంటారు. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో వేరే పార్టీ పాలనెందుకు అంటూ ఆయన ప్రజలకు మైండ్ వాష్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. మరోవైపు రాష్ట్రాల్లో కూటములను కూలగొట్టి అధికారాన్ని చేజిక్కించుకోవడం అనే దొడ్డిదారి ప్రయత్నాలను కూడా బీజేపీ ఆపడంలేదు. అసలింతకీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే కలిసొచ్చే అంశాలేంటి. యూపీలో డబుల్ ఇంజిన్ ఉంది కదా, మరి ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారెందుకు..? ఆరు నెలలుగా జీతాలివ్వకుండా నెట్టుకొస్తున్న యూపీలో డబుల్ ఇంజిన్ దేనికోసం..? ఎవరికోసం..? ఇప్పుడీ ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
దేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా యూపీ త్వరలోనే అవతరిస్తుంది, ధనిక రాష్ట్రంగా మారిపోతుంది అంటూ ఇటీవల ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ అక్కడ క్షేత్రస్థాయి వాస్తవం వేరు. రాష్ట్ర జల్ నిగమ్ ఉద్యోగులకు 6 నెలలుగా జీతాల్లేవు. 20వేలమంది ఉద్యోగులు జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. ఇదీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీలోని దారుణ పరిస్థితి.
జీతాలే కాదు, కనీసం జల్ నిగమ్ ఉద్యోగులకు పింఛన్ డబ్బులు కూడా విడుదల చేయడం లేదని వాపోతున్నారు వారంతా. ఉద్దేశపూర్వకంగానే తమకు జీతాలు ఆపుతున్నారని, బకాయిలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. జల్ నిగమ్ ఏర్పాటైన సెప్టెంబర్-9న బ్లాక్ డే గా పాటిస్తామని అంటున్నారు.
ఎందుకీ అవస్థ..?
యూపీ జల్ నిగమ్ (వాటర్ కార్పొరేషన్)లో గతేడాది జీతాల పెంపుకోసం ఉద్యోగులు ధర్నా చేశారు. కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. పీఆర్సీ ప్రకారం జీతాలు పెరగాల్సి ఉన్నా, మీనమేషాలు లెక్కించింది. చివరకు ఉద్యోగులు తిరగబడటంతో ఆరు నెలలుగా వారికి సక్రమంగా జీతాలు ఇవ్వడంలేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ తో పని పూర్తి చేయాలని చూస్తున్నారు. మరోవైపు పింఛన్ తీసుకునేవారి పరిస్థితి మరీ ఘోరంగా మారింది. పింఛన్ బకాయిలు ఇవ్వకుండా యోగి సర్కార్ ఆపివేసింది. దీంతో రిటైర్ అయిన ఉద్యోగులు కూడా అవస్థలు పడుతున్నారు. యోగి నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారంతా. డబుల్ ఇంజిన్ సర్కారు అని గొప్పలు చెప్పుకోవడం కాదని, జీతాల్లేకుండా తాము పడుతున్న అవస్థలు చూడాలంటున్నారు. వారం రోజులుగా ఉద్యోగులు విధులు బహిష్కరిస్తూ, పింఛన్ దారులతో కలసి ఆందోళనలు చేపడుతున్నారు. కానీ ఫలితం లేకపోవడంతో డెడ్ లైన్ ప్రకటిస్తూ సర్కారుకి అల్టిమేట్టం ఇచ్చారు. సెప్టెంబర్-9 తర్వాత తాడోపేడో తేల్చుకుంటామని అంటున్నారు.