Telugu Global
National

చేతులు కాలాక బుల్డోజర్లు పంపిస్తున్న యూపీ సర్కార్..

అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్మించారని, శుక్రవారంలోగా ఖాళీ చేయాలని నోటీసులిచ్చారు. ఆస్పత్రి ఖాళీ చేయకపోతే బుల్డోజర్‌తో కూల్చేస్తామని హెచ్చరించారు. ఈ ఏడాది మొదట్లోనే కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు నోటీసులో పేర్కొనడం విశేషం.

చేతులు కాలాక బుల్డోజర్లు పంపిస్తున్న యూపీ సర్కార్..
X

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో గ్లోబల్ ఆస్పత్రి నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయాక తీరిగ్గా యోగి సర్కారు కన్నెర్ర చేసింది. తనదైన స్టైల్‌లో అక్కడికి బుల్డోజర్లు పంపిస్తామంటూ హెచ్చరించింది. వాస్తవానికి ఆస్పత్రిలో అవకతవకలు జరిగితే వైద్య విభాగం తరపున తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆస్పత్రి నిర్మాణం అక్రమం అంటూ ప్రయాగ్ రాజ్ మున్సిపల్ అధికారులు తెరపైకి వచ్చారు. అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్మించారని, శుక్రవారంలోగా ఖాళీ చేయాలని నోటీసులిచ్చారు. ఆస్పత్రి ఖాళీ చేయకపోతే బుల్డోజర్‌తో కూల్చేస్తామని హెచ్చరించారు. ఈ ఏడాది మొదట్లోనే కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆ నోటీసులో పేర్కొనడం విశేషం.

ప్లేట్ లెట్స్ బదులు, బత్తాయి జ్యూస్‌ని రోగి శరీరంలోకి ఎక్కించడం వల్ల ఓ డెంగీ రోగి చనిపోయాడనేది గ్లోబల్ ఆస్పత్రిపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీంతో గతవారం ఆస్పత్రిని సీజ్ చేశారు. అయితే ప్లేట్ లెట్ బ్యాగ్‌లో ఉన్నది జ్యూసా లేక ఇతర పదార్థమా అనేదానిపై క్లారిటీ లేదు. నిపుణుల నివేదికను అధికారులు బయటపెట్టలేదు. ఈలోగా యూపీలో నకిలీ ప్లాస్మా ముఠా గుట్టు రట్టయింది. నకిలీ ప్లేట్‌ లెట్స్ సరఫరా చేసే ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్‌ చేసినట్లు ప్రయాగ్‌ రాజ్‌ ఎస్పీ తెలిపారు.

యూపీలో వైద్య విభాగం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే సిసలైన ఉదాహరణ. డెంగీ పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా, ప్లేట్ లెట్స్ పేరుతో జోరుగా అక్కడ వ్యాపారం జరుగుతోంది. ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకోడానికి నకిలీ ప్లేట్ లెట్స్ ముఠా పుట్టుకొచ్చింది. ఇంత జరుగుతున్నా సర్కారుకి ఏమాత్రం పట్టలేదు. తీరా ఓ వ్యక్తి ప్రాణం పోయాక, ఇప్పుడు ఆస్పత్రి నిర్మాణం అక్రమం అంటూ బుల్డోజర్లు తీసుకొస్తున్నారు. వైద్యరంగంలో యూపీ ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

First Published:  26 Oct 2022 7:01 PM IST
Next Story