Telugu Global
National

యుపి అసెంబ్లీ ఆవరణలో జర్నలిస్టులను చితకబాదిన మార్షల్స్

జర్నలిస్టులు తెలిపిన వివరాల‌ ప్రకారం, నిరసనను కవర్ చేయకుండా నిరోధించడానికి మాత్రమే మార్షల్స్ ఈ విధమైన హింసకు పాల్పడ్డారు. మార్షల్స్ జర్నలిస్టులను నిరసన స్థలం నుంచి తొలగించేందుకు వారిని కొట్టారు. లాగిపడేశారు. ఈ ఘటనలో మీడియా సిబ్బంది కెమెరాలు, ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. అనేక మందికి గాయాలయ్యాయి.

యుపి అసెంబ్లీ ఆవరణలో జర్నలిస్టులను చితకబాదిన మార్షల్స్
X

ఫిబ్రవరి 20, సోమవారం ఉత్తరప్రదేశ్ శాసనసభ బైట‌ సమాజ్‌వాదీ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులను మార్షల్స్ చితకబాదారు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు గాయపడ్డారు. ఒక ఫోటో జర్నలిస్ట్ ముఖంపై గాయాలయ్యాయి.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అసెంబ్లీకి రావడానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఘటన జరిగింది.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం హయాంలో పెరిగిన‌ నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ధరల పెరుగుదల వంటి ఇతర సమస్యలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ ఆవరణలోని మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ విగ్రహం వద్ద ఈ నిరసన జరగాల్సి ఉంది.

జర్నలిస్టులు తెలిపిన వివరాల‌ ప్రకారం, నిరసనను కవర్ చేయకుండా నిరోధించడానికి మాత్రమే మార్షల్స్ ఈ విధమైన హింసకు పాల్పడ్డారు. మార్షల్స్ జర్నలిస్టులను నిరసన స్థలం నుంచి తొలగించేందుకు వారిని కొట్టారు. లాగిపడేశారు. ఈ ఘటనలో మీడియా సిబ్బంది కెమెరాలు, ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. అనేక మందికి గాయాలయ్యాయి.

అసెంబ్లీ ఆవరణలో జర్నలిస్టులపై ఇంతటి హింస ఎన్నడూ జరగలేదని జర్నలిస్టులు అన్నారు. సభ లోపల పరిస్థితిని చక్కదిద్ద‌డం వరకే పరిమితమైన మార్షల్స్ బైట తమపై దాడి చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. సభ వెలుపల పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత పోలీసులది కదా అని వారు అన్నారు.

సీనియర్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ సెమాబ్ నఖ్వీ మాట్లాడుతూ, “మీడియాలో ప్రతిపక్షాల కవరేజీ రాకుండా చేయడానికి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం అనిపిస్తుంది. మార్షల్స్ నన్ను కవరేజ్ చేయకుండా ఆపడానికి ప్రయత్నించారు. రాష్ట్ర అసెంబ్లీలో మీడియా కవరేజీకి అంతరాయం కలిగించడం ఇదే మొదటిసారి అన్నారాయన‌

మార్షల్స్ జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించారని, వారిని కొట్టారని తన‌ ముఖంపై పిడిగుద్దులు కురిపించారని ఫోటో జర్నలిస్ట్ విశాల్ శ్రీవాస్తవ అన్నారు. “మేము ఒక దశాబ్దానికి పైగా రాష్ట్ర అసెంబ్లీని కవర్ చేస్తున్నాము. కానీ విధి నిర్వహణలో ఇంత అవమానాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. సమస్యను ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం అన్నారాయన.

ఉత్తరప్రదేశ్ అక్రెడిటెడ్ కరస్పాండెంట్ కమిటీ (యుపిఎసిసి) ఈ సంఘటనను ఖండించింది. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానాతో సమావేశమై తమ నిరసనను వ్యక్తం చేసింది. జర్నలిస్టులపై దాడికి దిగిన‌ మార్షల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

“మార్షల్స్ నుండి ఇంత భయంకరమైన ప్రవర్తనను మేము ఎప్పుడూ చూడలేదు. అసెంబ్లీ కవరేజీ సమయంలో జర్నలిస్టులపై ఇంత రౌడీయిజం యూపీ అసెంబ్లీ చరిత్రలో ఇదే తొలిసారి’’ అని యూపీఏసీసీ పేర్కొంది.

జర్నలిస్టులపై జరిగిన దాడిని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఖండించారు. బిజెపి ప్రభుత్వం మొత్తం వ్యవస్థను నియంతృత్వంగా మార్చిందని ఆయన మండిపడ్డారు. ప్రజాసమస్యలపై నిరసన తెలపడం ప్రతిపక్షాల ప్రజాస్వామ్య హక్కు అని, దానిని కవర్ చేయాల్సిన బాధ్యత మీడియా, జర్నలిస్టులపై ఉందన్నారు.

''విధానసభ ఆవరణలో జర్నలిస్టులపై దాడులు జరగడం అప్రజాస్వామికం. బిజెపి ప్రభుత్వం తన దుష్పరిపాలన గురించి వార్తలను చూడడానికి , వినడానికి ఇష్టపడదు, ”అని అఖిలేష్ యాదవ్ అన్నారు.

First Published:  21 Feb 2023 7:06 AM IST
Next Story