Telugu Global
National

ప్రజల నెత్తిన కేంద్రం మరో పిడుగు.. డిమాండ్ ప్రకారం కరెంటు చార్జీల వసూలు

'టైం ఆఫ్ డే' (టీవోడీ) పేరుతో తీసుకొని వస్తున్న ఈ కొత్త చార్జీలను 2024 ఏప్రిల్ 1 నుంచి పరిశ్రమలు, వాణిస్య సంస్థలకు.. 1 ఏప్రిల్ 2025 నుంచి గృహాలతో పాటు ఇతర అన్ని రకాల వినియోగదారులకు వర్తింప చేయనున్నారు.

ప్రజల నెత్తిన కేంద్రం మరో పిడుగు.. డిమాండ్ ప్రకారం కరెంటు చార్జీల వసూలు
X

ఇకపై విద్యుత్ వాడకంలో జాగ్రత్తగా ఉండకపోతే బిల్లులు వాచిపోవడం ఖాయం. ఇన్నాళ్లూ రోజులో ఏ సమయంలో అయినా ఒకటే రేటు. పగలైనా, రాత్రైనా యూనిట్‌కు ఇంత అంటూ వసూలు చేస్తున్నారు. కాకపోతే 100 యూనిట్లు, 200 యూనిట్లు అంటూ స్లాబ్స్ పెట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు. కానీ ఇకపై రోజు మొత్తం ఒకేలా చార్జీలు ఉండవు. సమయాన్ని బట్టి రేట్లు మార్చే ప్రతిపాదనను కేంద్ర విద్యుత్ శాఖ సిద్ధం చేస్తోంది. డిమాండ్ ఉన్నప్పుడు ఒక రేటు.. డిమాండ్ లేనప్పుడు మరో రేటు వసూలు చేసేలా ముసాయిదాను రూపొందించింది. అదే కనుక అమలులోకి వస్తే సామాన్యుడితో పాటు పరిశ్రమలు కూడా విద్యుత్ చార్జీలతో కుదేలవ్వాల్సిందే.

'టైం ఆఫ్ డే' (టీవోడీ) పేరుతో తీసుకొని వస్తున్న ఈ కొత్త చార్జీలను 2024 ఏప్రిల్ 1 నుంచి పరిశ్రమలు, వాణిస్య సంస్థలకు.. 1 ఏప్రిల్ 2025 నుంచి గృహాలతో పాటు ఇతర అన్ని రకాల వినియోగదారులకు వర్తింప చేయనున్నారు. ఇదే కనుక అములోకి వస్తే పరిశ్రమలు, కమర్షియల్ కనెక్షన్లకు 20 శాతం మేర.. గృహాలకు 10 శాతం మేర విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. అయితే ఒక సమయంలో ఈ విద్యుత్ చార్జీలను తగ్గించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ ముసాయిదాలోని అంశాలతో కూడిన ప్రతిపాదనలను అన్ని రాష్ట్రాలకు పంపింది. ఏప్రిల్ 14 లోగా దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ-మెయిల్ ద్వారా పంపాలని కోరింది.

విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండే ఉదయం 6 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు విద్యుత్ చార్జీలు పెరుగుతాయి. ఇక ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి.. మధ్యాహ్న సమయంలో చార్జీలను కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో శనివారం 12 గంటల 11 నిమిషాలకు అత్యధికంగా 13,970 మెగావాట్ల డిమాండ్ ఉంది. అంటే.. కేంద్ర ప్రతిపాదన అమలులోకి వస్తే.. ఆ సమయంలో విద్యుత్ వాడితే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తారు. విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో గ్రిడ్ నిర్వహణ సమస్యగా మారుతోంది. దీని పరిష్కారానికే.. డిమాండ్ తగ్గించడానికి టీవోడీ పద్దతిని అమలులోకి తెస్తున్నామని కేంద్రం చెబుతోంది.

టీవోడీని అమలు చేయాలంటే దేశంలోని అన్ని విద్యుత్ మీటర్లను స్మార్ట్ మీటర్లుగా మార్చాలి. అంతే కాకుండా మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు విద్యుత్ వినియోగాన్ని చూసుకోవచ్చు. ఇక టీవోడీ కింద ఏ సమయంలో ఎంత చార్జీ పడుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఈ చార్జీలను నిర్ణయించే అధికారం మాత్రం రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలికి అప్పగించనున్నారు. ఒక విద్యుత్ కనెక్షన్ ఎంత లోడు తీసుకుంటుందో కూడా ప్రతీ నెల తెలుస్తుంది. ప్రతీ ఏడాది స్మార్ట్ మీటర్‌లో నమోదయ్యే లోడును బట్టి మార్పులు ఉంటాయని ప్రతిపాదనలో పేర్కొన్నారు.

First Published:  26 March 2023 9:08 AM IST
Next Story