Telugu Global
National

ఢిల్లీలో శ్రద్ద హత్య: తప్పు ఆమెదేనట...కేంద్ర మంత్రి హృదయం లేని, క్రూరమైన వ్యాఖ్యలు!

ఢిల్లీ యువతి హత్య పై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యకు పూర్తి బాధ్యత ఆమెదే అని బాధితురాలినే దోషిగా ప్రకటించి తన పురుషాహంకారాన్ని బైటపెట్టుకున్నాడు.

ఢిల్లీలో శ్రద్ద హత్య: తప్పు ఆమెదేనట...కేంద్ర మంత్రి హృదయం లేని, క్రూరమైన వ్యాఖ్యలు!
X

దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధ వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ దారుణంగా హత్య చేసి అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి ఢిల్లీలో పలు చోట్ల పడేసిన‌ ఘటన దేశవ్యాప్తంగా ధిగ్బ్రాంతిని కలిగించింది. దేశంలో ప్రతి ఒక్కరూ శ్రద్ద పట్ల సానుభూతిని చూపిస్తూ అఫ్తాబ్ పట్ల ఆగ్రహంతో రగిలిపోతుండగా కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కు మాత్రం శ్రద్ద హత్యకు ఆమెనే కారణమనిపించింది. బాధితులనే దోషులుగా చేయడం అలవాటుగా మారిన బీజేపీ నాయకుల్లో ఒకరైన కౌశల్ కిషోర్ ఈ మొత్తం సంఘటనకు హత్యకు గురైన‌ శ్రద్దనే దోషిగా ప్రకటించాడు.

సిఎన్ఎన్-న్యూస్ 18 టెలివిజన్ ఛానెల్ తో కౌశల్ కిషోర్ మాట్లాడుతూ, చదువుకున్న యువతులు లివ్ ఇన్ రిలేషన్ కోసం తమ తల్లిదండ్రులను విడిచిపెట్టడాన్ని మనం వ్యతిరేకించాలి అన్నారు.

పైగా ''ఈ హత్యకు పూర్తి బాధ్యత ఆమెదే. ఈ ప్రేమను, లివ్ ఇన్ రిలేషన్ ను ఆమె తల్లి, తండ్రులు వ్యతిరేకించారు. అయినా ఆ అమ్మాయి అతనితో కలిసి ఉండటం తప్పు. మీరు ప్రేమిస్తే పెళ్ళి చేసుకోండి ఈ లివ్-ఇన్ రిలేషన్ ఏమిటి? ఇలాంటి పద్ధతులు నేరాలను ప్రోత్సహిస్తాయి." అన్నాడు మంత్రి

కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడిన ఈ మాటలు దేశ‌వ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. రాజకీయ నాయకులు, సోషల్ మీడియాలో నెటిజనులు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయనను తక్షణం మంత్రిపదవి నుంచి తొలగించాలని శివసేన (ఉద్దవ్ ఠాక్రే) నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.

''కిషోర్ ది సిగ్గులేని, హృదయం లేని, క్రూరమైన, అన్ని సమస్యలకు స్త్రీని నిందించే మనస్తత్వం" అని ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్త్రీ శక్తి గురించి మాట్లాడిన మాటల్లో నిజాయితీ ఉంటే ఈ మంత్రిని వెంటనేతొలగించాలి అని ఆమె డిమాండ్ చేశారు.

''ఇప్పటికే ఈ సమాజంలో ఇటువంటి పితృస్వామ్య చెత్త భారాన్ని మేము చాలా ఎక్కువగానే మోస్తున్నాం'' అన్నారామె

నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా మే 18న తన లివ్ ఇన్ పార్ట్‌నర్ శ్రద్ధా వికాస్ వాకర్‌ను హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఛత్తర్‌పూర్, మెహ్రౌలీ ప్రాంతాల్లో పడేశాడు.

ఆఫ్తాబ్ అమీన్, శ్రద్దా వాకర్ 2019లో ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్ ద్వారా కలుసుకున్నారు. తర్వాత, వారు ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని కాల్ సెంటర్‌లో పని చేయడం ప్రారంభించారు. వారి కుటుంబాలు వారి సంబంధాన్ని వ్యతిరేకించడంతో, ఈ జంట ముంబైలో కలిసి జీవించడం ప్రారంభించారు. ఈ సంవత్సరం మేలో వారు ఢిల్లీకి వెళ్లారు.


First Published:  17 Nov 2022 9:34 PM IST
Next Story