అమెజాన్‌లో అవి అమ్మొద్దు.. గడ్కరీ వార్నింగ్..
సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా అలారం మోగకుండా చేసే మెటల్ క్లిప్ లు ఇకపై అమెజాన్ లో అమ్మడానికి వీల్లేదంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ప్రపంచంలో ఏ రూల్ అయినా బ్రేక్ చేయడానికి కొన్ని చావు తెలివితేటలు ఉంటాయి. ఆ తెెలివితేటలు నిజంగానే చావుని కొనితెస్తే..? అలాంటి ఉదాహరణే ఇది. కారులో సీటుబెల్ట్ పెట్టుకోకపోతే అలారం మోగుతుంది. అలారం మోగకుండా చేయాలంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. కానీ బెల్ట్ పెట్టుకోవడం ఇష్టంలేని చాలామంది దాన్ని వెనుకనుంచి తగిలించి కూర్చుంటారు. అయితే అలా సీట్లో కూర్చోవడం అంత సౌకర్యంగా ఉండదు. దీనికోసం మెటల్ క్లిప్ లు కొన్ని మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఇవి ఆన్ లైన్ పోర్టల్ అమెజాన్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ మెటల్ క్లిప్ తగిలించి వదిలేస్తే చాలు, కారులో సీటుబెల్ట్ పెట్టుకోకపోయినా అలారం మోగదు. మరి ప్రమాదం జరిగితేనో.. కచ్చితంగా ప్రాణాపాయమే. అంటే చావుని అమెజాన్ లో కొని తెచ్చుకుంటున్నట్టే లెక్క. ఇకపై ఇలాంటి మెటల్ క్లిప్ లు అమ్మడానికి వీల్లేదంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అమెజాన్ కి ఆదేశాలిచ్చారు.
హెల్మెట్ లాగే ఇది కూడా..?
బైక్ పై వెళ్తే హెల్మెట్ కచ్చితంగా ధరించాలంటూ నిబంధనలున్నా కూడా చాలామంది లైట్ తీసుకుంటారు. ప్రమాదం జరిగితే ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. హెల్మెట్ ఉంటే ప్రమాదం జరిగినా ముప్పు తక్కువగా ఉంటుందని చాలా సందర్భాల్లో రుజువైంది. బైక్ కి హెల్మెట్ లాగే, కారుకి సీటు బెల్ట్. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సైరస్ మిస్త్రీ కూడా సీటు బెల్ట్ పెట్టుకోలేదని తేలింది. వెనుక సీట్లో సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా అలారం మోగే టెక్నాలజీ తీసుకు రావాలంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రమాదం జరిగినప్పుడు వెనుక సీట్లలో కూర్చున్నవారికి కూడా ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ అయ్యేలా కార్లలో మార్పులు తీసుకు రావాలని సూచిస్తున్నారాయన. ఈ నేపథ్యంలో తాజాగా మెటల్ క్లిప్ లపై కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
కార్లలో సీట్ బెల్ట్ పోట్టుకోకపోతే అలారం మోగకుండా చేసే మెటల్ క్లిప్ ల అమ్మకాన్ని నిలిపివేయాలంటూ అమెజాన్ కి నోటీసులు జారీ చేశారు గడ్కరీ. గతేడాది భారత్ లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1.5 లక్షల మంది మరణించారని ఈ గణాంకాలు ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తున్నాయని అన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రతి నాలుగు నిమిషాలకు భారత్ లో రోడ్డు ప్రమాదం కారణంగా ఒకరు మరణిస్తున్నారని అన్నారాయన.