Telugu Global
National

పవన్ డైరెక్టర్ తో నితిన్ గడ్కరీ భేటీ

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి ఒక్కరినీ తమ ప్రచారానికి బీజేపీ ఉపయోగించుకుంటోందని టాక్ నడుస్తోంది.

పవన్ డైరెక్టర్ తో నితిన్ గడ్కరీ భేటీ
X

టాలీవుడ్ - బీజేపీ మధ్య సంబంధం ఎంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులను బీజేపీ అగ్ర నాయకులు వరుసగా కలుస్తున్నారు. కొన్ని నెలల కిందట అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఇది జరిగిన కొద్ది రోజులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో హీరో నితిన్‌తో స‌మావేశ‌మ‌య్యారు.

ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా.. అమిత్ షా సదస్సు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి చిరంజీవి, చరణ్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

గత వారం అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. తుపాను కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. ఒకవేళ ఆయన హైదరాబాద్‌కు వస్తే దర్శకుడు రాజమౌళితో భేటీ కావాలని భావించారు.


ఇదిలా ఉండగా.. ఇవాళ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్‌తో భేటీ అయ్యారు. హరీష్ శంకర్‌ని గడ్కరీ తన నివాసానికి పిలిపించుకొని సమావేశం అయ్యారు. ఇద్దరూ కలిసి కొంతసేపు మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'భారతీయ ఆధునిక రహదారుల రూపశిల్పిని, దూరదృష్టి కలిగిన నాయకుడు నితిన్ గడ్కరీని కలవడం చాలా ఆనందంగా ఉంది. గడ్కరీ సార్.. మీతో సమయం గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది' అని ట్వీట్ చేశాడు. గడ్కరీతో దిగిన ఫొటోలను కూడా ఈ సందర్భంగా హరీష్ శంకర్ షేర్ చేశాడు.

గడ్కరీ దర్శకుడు హరీష్ శంకర్‌ని ప్రత్యేకంగా పిలిపించి సమావేశం అవడానికి గల కారణాలు తెలియడం లేదు. బీజేపీ అగ్ర నాయకులు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో వరుసగా ఎందుకు భేటీలు నిర్వహిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి ఒక్కరినీ తమ ప్రచారానికి బీజేపీ ఉపయోగించుకుంటోందని టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే తెలుగు సినీ సెలబ్రెటీలను బీజేపీ అగ్ర నాయకులు కలుస్తున్నారని సమాచారం.

దర్శకుడు హరీష్ శంకర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్‌తో మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉన్న సమయంలోనే హరీష్ శంకర్‌తో గడ్కరీ భేటీ కావడం ప్రాధాన్యత‌ సంతరించుకుంది.

First Published:  26 Jun 2023 8:33 PM IST
Next Story