మోదీ చెంప చెల్లుమనేలా గడ్కరీ వ్యాఖ్యలు..
ప్రపంచంలో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెబుతూనే ధనిక దేశంగా నిలిచినప్పటికీ, ప్రజలు మాత్రం పేదవారిగానే ఉన్నారని చెప్పారు నితిన్ గడ్కరీ.
ఎనిమిదేళ్ల అధికారంలో మోదీ ఏం సాధించారు..? బీజేపీ నేతల్ని అడిగితే రకరకాల గణాంకాలు చెబుతారు. అందులో రూపాయి పతనం ఉండదు, పెట్రోల్ రేట్ల పెంపు ఉండదు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం.. ఇలాంటివి లేకుండా జాగ్రత్తపడుతూ మాయా ప్రపంచం సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అలాంటి వ్యక్తి కాదు, ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టే రకం. ఇప్పటికే పలుమార్లు భారత పతనావస్థను కళ్లకు కట్టిన గడ్కరీ, మరోసారి భారతీయుల దీనస్థితిని వివరించారు. పేద ప్రజలున్న ధనికదేశం భారత్ అని ముక్తాయించారు.
పొగుడుతూనే తిట్టారు..
ప్రపంచంలో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెబుతూనే ధనిక దేశంగా నిలిచినప్పటికీ, ప్రజలు మాత్రం పేదవారిగానే ఉన్నారని చెప్పారు నితిన్ గడ్కరీ. ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. నాగ్ పూర్ లో భారత్ వికాస్ పరిషత్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. విపక్షాలకు సరైన అస్త్రాలుగా దొరికాయి.
అంతరం పెరుగుతోంది..
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదనే భావన ఇప్పటి వరకూ అందరిలో ఉంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒరిగేదేమీ లేకపోయినా తరిగేది ఎక్కువ కావడంతో ప్రజలకు జ్ఞానోదయం అవుతోంది. కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వం ఉండకూడదో.. అలాంటి ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా ఉండటమే భారత్ కి శాపంగా మారింది. దేశంలో ధనిక, పేదల మధ్య అంతరం పెరగడమే దీనికి ఉదాహరణ. ఈ అంతరం భారీగా పెరుగుతోందని, దీనికి అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందన్నారు నితిన్ గడ్కరీ. ఇది సమాజ పురోగమనానికి మంచిది కాదని చెప్పారు. పేద-ధనిక వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు విద్య, ఆరోగ్యం, సేవా రంగాల్లో కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారాయన. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు, అవకాశాలు తగినంతగా లేకపోవడంతో అక్కడి జనం భారీగా నగరాలకు వలస వెళ్తున్నారని అన్నారు.
బీజేపీ నేతలు ఏమంటారు..?
ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేద, ధనిక అంతరంపై చేసిన వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలి..? కనీసం కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉంటుందా..? గడ్కరీ వ్యాఖ్యల్ని ఖండించే దమ్ము ఎలాగూ లేదు. కనీసం ఎన్నికలకు రెండేళ్ల ముందయినా ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాల్సిన సందర్భం ఉంది. కానీ కేంద్రంలోని బీజేపీ మత విద్వేషాలనే నమ్ముకుంది. మతాల చిచ్చు ఆల్రడీ రాజేసింది. ఆ మంటలో చలి కాచుకోడానికి సిద్ధమవుతోంది.