Telugu Global
National

కొలీజియంపై పెత్తనం కోరుకుంటున్న కేంద్రం..

కొలీజియంలో చోటు సంపాదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ముందు చోటు, ఆ తర్వాత పెత్తనం.. ఇదే కేంద్రం విధానం అని అర్థమవుతోంది.

కొలీజియంపై పెత్తనం కోరుకుంటున్న కేంద్రం..
X

న్యాయమూర్తుల నియామకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఇటీవల విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. న్యాయమూర్తుల నియామకం తమ కనుసన్నల్లోనే జరగాలని కోరుకుంటోంది కేంద్రం. అలా కాకుండా కొలీజియంకే పూర్తిగా పెత్తనం ఉండటాన్ని సహించలేకపోతోంది. ఇటీవల కొలీజియం సిఫారసులను కేంద్రం వెనక్కి తిప్పి పంపించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం చేసిన నేపథ్యంలో తాజాగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లేఖ మరింత సంచలనంగా మారింది.

న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో.. హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని ఆయన కోరారు. జడ్జిల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం జడ్జిల నియామకాలకు సంబంధించి కొలీజియందే తుది నిర్ణయం. అయితే కొలీజియంకి ఉన్న స్వేచ్ఛను ఇటీవల కేంద్రం ప్రశ్నించింది. న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమన్నట్లుగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇటీవల చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. న్యాయస్థానాల్లో కొండల్లా పేరుకుపోయిన కేసులకు కొలీజియం వ్యవస్థే కారణమన్నట్లుగా కేంద్రమంత్రి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ ఖడ్‌ కూడా సుప్రీంకోర్టుపై కీలక వ్యాఖ్యలు చేసారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (NJAC)ని కొట్టివేయడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సార్వభౌమత్వాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్లయిందని ఆయన విమర్శించారు. దీనికి సుప్రీంకోర్టు బదులిచ్చింది. కొలీజియం నచ్చకపోతే ఇంకో వ్యవస్థను తీసుకురావాలని కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది.

ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కిరణ్ రిజిజు రాసిన లేఖ మరింత సంచలనంగా మారింది. అంటే కొలీజియంలో చోటు సంపాదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ముందు చోటు, ఆ తర్వాత పెత్తనం.. ఇదే కేంద్రం విధానం అని అర్థమవుతోంది. ఈ లేఖపై సీజేఐ ఎలా స్పందిస్తారో చూడాలి.

First Published:  16 Jan 2023 10:54 AM GMT
Next Story