Telugu Global
National

'ఏపీ పోలీస్ గో బ్యాక్'... కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కొఠియా ఏరియా ఏపీది కాదని, ఒడిశాదేనని చెప్పిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ‘ఏపీ పోలీస్ గో బ్యాక్’ అని వ్యాఖ్యానించారు. మంత్రి అలా అనడంతో ఆ వెంటనే ఆయన అనుచరులు కూడా ఏపీ పోలీస్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.

ఏపీ పోలీస్ గో బ్యాక్... కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ ఆయనకు ఏపీ పోలీసులు కనిపించారు. ఇక్కడ మీకేం పని అని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా గో బ్యాక్ ఏపీ పోలీస్ అని నినదించారు. దాంతో ఆయన వెంటవచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గో బ్యాక్ ఏపీ పోలీస్ అంటూ నినాదాలు చేసి ఏపీ పోలీసులను అవమానించారు.

దీని వెనక కథేంటి?

గత ఐదు దశాబ్దాలుగా 21 గ్రామాలతో కూడిన కొటియా గ్రామ పంచాయతీ పై ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. ఆ గ్రామాలు తమవే అని రెండు రాష్ట్రాలు క్లెయిమ్ చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలు కోటియాపై ఒకరి పరిపాలనా నియంత్రణను మరొకరు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. సుప్రీం కోర్టు 2006లో యథాతథ స్థితిని ఆదేశించింది.

2021లో, ఆంధ్ర ప్రదేశ్ కోటియా గ్రామాలలో ఓటింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. కొన్ని గ్రామాలలో ప్రత్యక్ష పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. ఒక సంవత్సరం తర్వాత, ఇవే గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. అక్కడ ప్రస్తుతం రెండు రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన సాగుతోంది. అక్కడ రెండు రాష్ట్రాల పోలీసులుంటారు.

నిన్న ఏం జరిగింది ?

శనివారం ఒడిశా వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కోటియా గ్రామపంచాయతీలోని ఫట్సినేరు అనే గ్రామాన్ని ధర్మేంద్ర ప్రధాన్ సందర్శించారు. ఆయనతో పాటు ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు.

ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొఠియా సీఐ రోహిణీపతిని మీరెవరని మంత్రి ప్రశ్నించారు. తాము ఏపీ పోలీసులమని సీఐ జవాబుచెప్పారు.

ఆ వెంటనే మంత్రి కోపంతో ఏపీ పోలీసులకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. దీంతో కొఠియాలోని 21 గ్రామాలు ఇరు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని సీఐ చెప్పారు. ఈసారి మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కొఠియా ఏపీది కాదని, ఒడిశాదేనని చెబుతూ.. ‘ఏపీ పోలీస్ గో బ్యాక్’ అని వ్యాఖ్యానించారు. మంత్రి అలా అనడంతో ఆ వెంటనే ఆయన అనుచరులు కూడా ఏపీ పోలీస్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.

ఇది ఏపీ పోలీసులకు జరిగిన అవమానమని ఏపీ ప్రజలు భావిస్తుండగా ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పంధించలేదు. కానీ ఆశ్చర్యంగా కేంద్ర మంత్రిపై ఒడిశా అధికార పార్టీ బీజేడీ తీవ్రంగా విరుచుకపడింది.

ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కొటియా గ్రామాల సమస్యను పరిష్కరించడానికి ముందుకురాని కేంద్ర మంత్రులు ఇప్పుడు ఏపీ పోలీసులను గో బ్యాక్ అనడం ఎంత వరకు సమంజసమని బీజేడీ మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ మూడు పేజీల సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

“కోటియా కోసం ఒడిశా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడు ప్రధాన్ ఎక్కడ ఉన్నారు? కోటియా కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు ప్రధాన్ ఎందుకు నోరు మెదపలేదు? కేంద్ర మంత్రి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.'' అని అధికార బీజేడీ మండిపడింది.

First Published:  2 April 2023 9:48 AM IST
Next Story