భారత్ ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’గా గుర్తింపు సాధించింది.. - కేంద్ర మంత్రి భగవంత్ ఖుభా
భారతదేశం ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’ గా గుర్తింపు సాధించిందన్నారు. మన దేశంలో తయారయ్యే జనరిక్ ఔషధాలు 200 దేశాలకుపైగా ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.
రానున్న రోజుల్లో మానవాళికి నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య చికిత్స, ఔషధాలు, టీకాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రపంచస్థాయిలో సమష్టి చర్యలు అవసరమని కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభా స్పష్టం చేశారు. ఇందుకుగాను పరిశోధన, ఆవిష్కరణల్లో అన్ని దేశాల మధ్య సమన్వయం ఉండాలన్నారు. హైదరాబాద్ HICCలో వైద్య రంగంపై జి-20 వర్కింగ్ గ్రూప్ రెండో రోజు సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో వైద్య చికిత్స, టీకాలు, ఔషధాల తయారీలో ప్రపంచస్థాయిలో చర్యలను బలోపేతం చేయడంపై చర్చ జరిగింది.
ఈ చర్చలో కేంద్ర మంత్రి భగవంత్ ఖుభా మాట్లాడుతూ.. భారతదేశం ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’ గా గుర్తింపు సాధించిందన్నారు. మన దేశంలో తయారయ్యే జనరిక్ ఔషధాలు 200 దేశాలకుపైగా ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. అమెరికా తనకు అవరమయ్యే జనరిక్ మందులలో 40 శాతాన్ని భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. అలాగే బ్రిటన్, ఆఫ్రికా దేశాలు 25 శాతం చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయిని తెలియజేశారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో ‘ఆపరేషన్ మైత్రీ’ కింద దాదాపు 100 దేశాలకు మందులు సరఫరా చేశామన్నారు. కరోనా వంటి మహమ్మారులను భవిష్యత్‌లో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ స్థాయిలో చర్యలను బలోపేతం, సమన్వయం చేయాల్సిన అవసరం వుందన్నారు. ఈ దిశగా భారత్ ‘వన్ హెల్త్’ అనే విధానంతో ముందుకు వెళుతోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. విభిన్న రంగాలలోని నైపుణ్యం, సామర్థ్యాన్ని సమన్వయ పరిచి, నిధులను సమీకరించి నాణ్యమైన ఔషధాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావలిసిన అవసరం వుందన్నారు.
అంతకుముందు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రీజనల్ రీసెర్చ్, నెట్వర్క్ అవసరం వుందని అన్నారు. అకస్మాత్తుగా ఆయా ప్రాంతాల్లో ఎదురయ్యే వ్యాధులు, ప్రాణాంతక రోగాల నుంచి మానవాళినే కాకుండా యావత్ జీవరాశి, పర్యావరణాన్ని రక్షించాలని,ఇందుకు స్థానిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవాలన్నారు. నైపుణ్యం, పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవాలని రాజేష్ భూషణ్ జి-20 సభ్య దేశాలకు సూచించారు. కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తదితరులు కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.