భారత్‌లో పెండింగ్ కేసులు 4.83కోట్లు
మంత్రి ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తం 4.83 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
భారత్‌లో కోర్టు కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో తీర్పుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. ఒకవైపు పెద్దసంఖ్యలో కేసులు పరిష్కారమవుతుండగానే.. మరోవైపు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయని అన్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు. లోక్ సభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మంత్రి ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తం 4.83 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసులు ఐదు కోట్ల మార్కుకు చేరుకుంటున్నాయని అన్నారు మంత్రి కిరణ్ రిజిజు. జూలై 1 నాటికి సుప్రీంకోర్టులో 72,062 కేసులు పెండింగ్ లో ఉండగా, జూలై 25 నాటికి భారత్ లోని 25 హైకోర్టుల్లో 59,55,873 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 4.23 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ మొత్తం కలిపి దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య 4.83 కోట్లకు చేరింది.
అయితే కేసులు భారీగా పెండింగ్ లో ఉండటానికి గల కారణాలను ప్రభుత్వం అంచనా వేసిందా అని కూడా ఎంపీలు మంత్రిని ప్రశ్నించారు. పెండింగ్ కేసుల వ్యవహారం న్యాయవ్యవస్థ పరిధిలోనిదని అన్నారు కేంద్రమంత్రి రిజిజు. ఆయా కోర్టులు వివిధ రకాల కేసుల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి నిర్దేశించలేదన్నారాయన. కోర్టుల్లో కేసుల పరిష్కారంలో ప్రభుత్వానికి ప్రత్యక్ష పాత్ర లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానాలలో కేసులను సకాలంలో పరిష్కరించడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని వివరించారాయన.
"కేసుల పరిష్కారంలో జాప్యానికి దారితీసే అనేక అంశాలున్నాయి. వీటిలో, న్యాయమూర్తుల ఖాళీలు, తరచుగా వాయిదాలు, విచారణ కోసం పర్యవేక్షించడానికి, ట్రాక్ చేయడానికి, బంచ్ కేసులను పర్యవేక్షించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం వంటివి ఉన్నాయి" అని చెప్పారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. పెండింగ్ లో ఉన్న కేసులకు ప్రభుత్వం లేదా న్యాయవ్యవస్థను నిందించడం సరికాదన్నారాయన. న్యాయమూర్తులు కష్టపడి పనిచేస్తారని, ఒకే రోజులో వందలాది కేసులను పరిష్కరించిన న్యాయమూర్తులు కూడా ఉన్నారని, వారు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తారని చెప్పారు మంత్రి.