Telugu Global
National

నీట్ లో గ్రేస్ మార్కులు లేవు.. వారికి మళ్లీ పరీక్ష

గ్రేస్ మార్కుల వ్యవహారం వివాదంగా మారడంతో, వాటిని తీసివేసి.. వారందరికీ తిరిగి పరీక్ష పెడతామంటోంది కేంద్రం. మరి ఈ పరీక్షకు ఆ విద్యార్థులు ఒప్పుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

నీట్ లో గ్రేస్ మార్కులు లేవు.. వారికి మళ్లీ పరీక్ష
X

నీట్ వివాదంపై కేంద్రం మధ్యే మార్గాన్ని వెదికింది. ఈ ఏడాది జరిగిన నీట్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వెల్లువెత్తడంతో గ్రేస్ మార్కుల విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది కేంద్రం. 1563మంది విద్యార్థులకు అదనంగా కలిపిన గ్రేస్ మార్కుల్ని రద్దు చేశారు. ఆయా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వట్లేదని సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఒకవేళ వారు పరీక్ష రాయకపోతే గతంలో వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని నెలాఖరులోగా పూర్తి చేసి జులై-6న కౌన్సెలింగ్ యాథాతథంగా నిర్వహిస్తామని చెప్పింది.

ఎందుకీ గ్రేస్ మార్క్ లు..?

ఈ ఏడాది జరిగిన నీట్‌ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వంటి కారణాలతో వారికి ఈ మార్కుల్ని అదనంగా కలిపారు. దీంతో ర్యాంకుల్లో గందరగోళం ఏర్పడింది. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ గందరగోళానికి కారణం గ్రేస్ మార్కులు అనితేలింది. ఒక్కో విద్యార్థికి 70నుంచి 80 గ్రేస్ మార్కులు కలపడంతో వారికి అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయి. ఈ వివాదం కోర్టుకి చేరడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

గ్రేస్ మార్కుల వ్యవహారం వివాదంగా మారడంతో, వాటిని తీసివేసి.. వారందరికీ తిరిగి పరీక్ష పెడతామంటోంది కేంద్రం. మరి ఈ పరీక్షకు ఆ విద్యార్థులు ఒప్పుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నీట్ పరీక్షపై విమర్శలు చెలరేగడంతో ప్రభుత్వం ఇరుకున పడింది.

First Published:  13 Jun 2024 1:28 PM IST
Next Story