Telugu Global
National

మ‌హిళా సాధికార‌త‌కు కేంద్రం చొర‌వ ఏది..?

ఆర్థిక లక్ష్యాల సాధనకోసం విభిన్నరంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి గాను తగిన ఉపాధి పథకాలు రూపొందించాలని గత ఏడాది రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలయితే లేవు.

మ‌హిళా సాధికార‌త‌కు కేంద్రం చొర‌వ ఏది..?
X

భారతదేశంలో సంఘటిత, అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందని ప్రపంచబ్యాంకు తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2021 సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలోని నైపుణ్య, నైపుణ్యేతర (స్కిల్డ్‌ అండ్‌ అన్‌స్కిల్డ్‌) పనుల్లో 23 శాతం మంది మహిళలు మాత్రమే నిమగ్నమై ఉన్నారు. 2005లో దేశ శ్రామికశక్తిలో మహిళల ప్రాతినిధ్యం 27 శాతం ఉండగా పదహారేళ్ల‌ కాలంలో ఇది 4 శాతం పడిపోవడం విస్మయకరం. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో 32 శాతం, శ్రీలంకలో 34.5 శాతం మహిళలు ఆయా దేశాల శ్రామికశక్తిలో భాగస్వామ్యం వహిస్తున్నారు.

ఒకవైపున ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా భారతదేశం అగ్రస్థానానికి చేరబోతుంది. మరోవైపున జనాభాలో సగభాగమైన మహిళల ఉపాధి లేమి అతి పెద్ద సమస్యగా పరిణమించనుంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ 14 నాటికి మన దేశ జనాభా 140 కోట్లకు చేరుతుంది. తద్వారా జనాభాలో చైనాని దాటుకొని ప్రథమస్థానం ఆక్రమిస్తుంది. అంతేగాక ఆసియాలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మూడోస్థానం భారత్‌ది. కానీ, ఆర్థికాభివృద్ధికి కీలకమైన ఉత్పత్తి రంగంలో మహిళల భాగస్వామ్యం మూడో వంతు కూడా లేకపోవడం ఆశ్చర్యకరం.

ఆర్థిక లక్ష్యాల సాధనకోసం విభిన్నరంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి గాను తగిన ఉపాధి పథకాలు రూపొందించాలని గత ఏడాది రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలయితే లేవు. కనీసం కోవిడ్‌ కల్లోల కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి పనులు కల్పించే పథకాలేవీ రూపొందించలేదు. ఉదాహరణకు కోవిడ్‌ - లాక్‌డౌన్‌ కారణంగా విద్యాలయాల్లో టీచర్లుగా పనిచేసే మహిళలు ఉపాధి కోల్పోయారు. వారిలో అనేకమందికి తిరిగి ఉద్యోగాలు లభించలేదు. బ్యూటీకేర్‌ రంగంలోనూ ఇదే పరిస్థితి. చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడి ఎందరో మహిళలు పనులు కోల్పోయారు. వారు ఇంకా నిరుద్యోగంతోనే అలమటిస్తున్నారు.

తమ చదువుకు తగిన ఉద్యోగాలు లభించక ఇతరేతర పనుల్లో చేరిన వారు కూడా మధ్యలో పనుల్లోంచి తొలగించబడుతున్నారు. కొందరికేమో కోవిడ్‌ కాలం ముందు లభించే వేతనాల్లో యాభైశాతం కూడా రావడం లేదు. ఈవిధంగా పాక్షిక నిరుద్యోగిత ఎదుర్కొనే మహిళల సంఖ్య పెరుగుతున్నది.

జనాభా పెరుగుదల ఒక రికార్డు కావచ్చు. ఇది ఒకవిధంగా సానుకూల అంశం. పనిచేసే శక్తి, వయసు వున్నవారి జనాభా ఆర్థిక పురోగతికి మంచిదే. అయితే వారికి తగిన ఉపాధికల్పించే బలాన్ని ఆర్థిక వ్యవస్థ సంతరించుకోవాలి. మరీ ముఖ్యంగా మహిళల శ్రమశక్తిని వినియోగించుకోడానికి అనువైన అభివృద్ధి పథకాలు రూపొందించాలని ఆర్థికవేత్తలు కోరుతున్నారు.

గతంతో పోలిస్తే మహిళలు పనిచేయాలని, సొంతంగా తమకు అంటూ ఆదాయం ఉండాలని కోరుకుంటున్నారు. ఇదివరకటిలా వివాహం వారికి ఉపాధి కాదు. సొంతంగా పనిచేస్తూ ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నారు. మహిళల అక్షరాస్యత పెరిగింది. అయితే అందుకు తగినట్టు ఉపాధికల్పన పెరగలేదు. భారతదేశంలో మహిళల ఉద్యోగ కల్పనకు విధానపరమైన చర్యలు తీసుకుంటే 2025 నాటికి స్థూల జాతీయోత్పత్తికి వందల కోట్ల డాలర్లు చేర్చగల సామర్థ్యం మహిళల శ్రామికశక్తికి ఉందని మెకీన్సీ కన్సల్టింగ్‌ సంస్థ 2018 నివేదికలోనే తెలియజేసింది.

పని ప్రదేశాల్లో మహిళల భాగస్వామ్యం కొరవడితే ఉత్పత్తి సామర్థ్యం, ఉత్పత్తి రేటు తగ్గడమే గాక ఆర్థిక అసమానతలు, ఆదాయ అసమానతలు ప్రబలే ప్రమాదముందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా పరిశోధకురాలు మయురాక్షి దత్తా ఓ నివేదికలో చెప్పారు. అందుకని పని ప్రదేశాల్లో వసతి సౌకర్యాలు మెరుగుపరచాలని, వేతనాల్లో వ్యత్యాసం లేకుండా చూడాలని, పనిలో తగిన కౌశలం చూపించే మహిళలకు ప్రోత్సాహకాలు అందించడం అభివృద్ధి గమనం వేగం అందుకోడానికి తోడ్పడుతుందని అనేక ఆర్థిక సర్వేలు నొక్కి చెప్పాయి. ఆత్మనిర్బరత, స్వావలంబన గురించి మాట్లాడే నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి గమనంలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. మరీ ముఖ్యంగా కోవిడ్‌ మూలంగా దెబ్బతిన్న మహిళలు తిరిగి కుదురుకొనేలా ఉపాధికల్పనకు చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రధాని చెప్పే మాటలకు విశ్వసనీయత ఉంటుంది.

First Published:  30 March 2023 6:10 PM IST
Next Story