ఆయన ఇటు... ఈయన అటు.. బెంగాల్ గవర్నర్ గా అబ్బాస్ నక్వి ?
ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థి గా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేశాక ఇక ఖాళీ అయిన ఆ పోస్టును భర్తీ చేయాల్సి ఉంది. దీనికి మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్విని సెలెక్ట్ చేయాలన్న యోచనలో బీజేపీ ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థి గా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేశాక ఇక ఖాళీ అయిన ఆ పోస్టును భర్తీ చేయాల్సి ఉంది. దీనికి మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్విని సెలెక్ట్ చేయాలన్న యోచనలో బీజేపీ ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తన రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన నేపథ్యంలో అబ్బాస్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. షియా ముస్లిం నేత అయిన నక్వికి, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య 'సత్సంబంధాలు' ఉండగలవన్న ఆశ ఈ పార్టీలో ఉంది. 2019 లో జగదీప్ ధన్ కర్ ఆ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైనప్పటి నుంచి ఆయనకు, బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య సజావైన సంబంధాలు లేవు. ముఖ్యంగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస అనంతరం వీరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఒక దశలో జగదీప్ ధన్ కర్ పై అభిశంసన తీర్మానాన్ని కూడా అసెంబ్లీ ప్రతిపాదించింది. ఇప్పుడు ధన్ కర్ కి కొత్త పోస్టు వచ్చే అవకాశం వచ్చింది గనుక నక్వికి గవర్నర్ పదవినిచ్చిన పక్షంలో మమత ను కూడా మచ్చిక చేసుకోవచ్చునని, మరో రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇది తమ పార్టీకి లాభించవచ్చునని బీజేపీ ఆశిస్తోంది.
మమతకు కంట్లో నలుసులా ఉన్న ధన్ కర్ ని ఉపరాష్ట్రపతి చేస్తామని కమలనాథులు ఇదివరకే తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వానికి సంకేతాలు పంపారట.. ఇందుకు తగినట్టే నక్వి రేసులో ఉన్నారని భావిస్తున్నారు. పైగా ఈయన మమతా బెనర్జీకి కొత్తేమీ కాదు. సీనియర్ నేత అయిన నక్వి లోగడ ఏబీ.వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో ఆమెకు సహచర మంత్రి కూడా.. ధన్ కర్ మాదిరి ఆయన మమత సర్కార్ తో విభేదించబోరని, సఖ్యతగా ఉంటారని భావిస్తున్నారు. నిజానికి కొత్త గవర్నర్ నియామకానికి ముందు కేంద్రం సదరు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న సాంప్రదాయం ఉన్నప్పటికీ ఇది తప్పనిసరి కాదు. అందువల్ల మోడీ ప్రభుత్వం నేరుగా నక్వీని బెంగాల్ గవర్నర్ గా పంపవచ్చు. పైగా బెంగాల్ లోని మైనారిటీల ఓట్లు తమకు పడగలవన్న ఆశ కూడా కేంద్రానికి ఉంది.
2005 లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న మమత పిలుపునకు అప్పటి బీజేపీ ఉపాధ్యక్షుడైన ముక్తార్ అబ్బాస్ నక్వి సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదన తమకు అంగీకారయోగ్యమేనన్నారు. నాటి ఈ స్నేహం ఇప్పుడు కూడా చిగురించినా చిగురించవచ్చు.. ఆ నాడు 29 ఏళ్ళ లెఫ్ట్ ప్రభుత్వ అసమర్థ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలన్న దీదీ పట్ల నక్వి సైతం ఇప్పటికీ మైత్రీ భావనతో ఉన్నారన్నది బీజేపీ వర్గాల అభిప్రాయం.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ముక్తార్ త్వరలో బెంగాల్ గవర్నర్ కావచ్చు.