Telugu Global
National

పత్తి రైతులకు తీరని అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్

ప్రైస్ సపోర్టు స్కీమ్ కింద కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి కొనుగోళ్లకు ఉద్దేశించిన కేటాయింపులు 2021-2022లో రూ.8,331.96 కోట్లు, 2022-2023లో రూ.9,243.09 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం కేవలం...

పత్తి రైతులకు తీరని అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్
X

నిన్న పార్లమెంటు లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ‌ పెట్టిన బడ్జెట్ లో పత్తి రైతులకు తీరని అన్యాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. రైతుల నుండి పత్తి కొనే 'కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'కు ఈ బడ్జెట్ లో 1 లక్ష రూపాయలు కేటాయించింది కేంద్రం.

ప్రైస్ సపోర్టు స్కీమ్ కింద కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి కొనుగోళ్లకు ఉద్దేశించిన కేటాయింపులు 2021-2022లో రూ.8,331.96 కోట్లు, 2022-2023లో రూ.9,243.09 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయించారు.

ఈ లక్ష రూపాయలతో దేశ వ్యాప్తంగా ఉన్న పత్తి రైతుల నుండి పత్తి కొనడం ఎలా సాధ్యమో ప్రభుత్వానికే అర్దం కావాలి. దీనర్దం పత్తి రైతులను పూర్తిగా ప్రైవేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలేసింది ప్రభుత్వం అనే విమర్శలు వస్తున్నాయి.

దీనిపై తెలంగాణ ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఇది కచ్చితంగా పత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగించేచర్య అని పేర్కొన్నారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండి, పత్తి సాగు విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోందని, బడ్జెట్‌లో కేటాయింపులు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి మండి పడ్డారు.

First Published:  2 Feb 2023 12:56 PM IST
Next Story