Telugu Global
National

ఆజాద్ నుంచి కాంగ్రెస్ కి ఊహించని మద్దతు..

ఆజాద్ సపోర్ట్ కాంగ్రెస్ ఊహించలేదు కానీ, పనిలో పనిగా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని వెనక్కి లాగడమే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. దీనివల్ల కాంగ్రెస్ కి లాభమా.. బీజేపీకి లాభమా అనేది తేలాల్సి ఉంది.

ఆజాద్ నుంచి కాంగ్రెస్ కి ఊహించని మద్దతు..
X

కాంగ్రెస్ తో అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని వేరుకుంపటి పెట్టుకున్న గులాంనబీ ఆజాద్.. ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ కు మద్దతు పలకడం విశేషం. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనంటూ జోస్యం చెప్పారు ఆజాద్. ఆమ్ ఆద్మీ పార్టీతో పని జరగదన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ కి మాత్రమే ఉందన్నారు ఆజాద్.

ఎందుకీ మద్దతు..?

కాంగ్రెస్ తో ఆజాద్ ది యాభయ్యేళ్ల అనుబంధం. అయితే నాయకత్వం విషయంలో ఆయన పార్టీతో విభేదించారు. అసమ్మతి గ్రూపుకి ఓ దశలో నాయకత్వం వహించారు. పార్టీలో తన సలహాలు, సూచనలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన వేరు కుంపటి పెట్టుకున్నారు. డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ స్థాపించారు. కేవలం జమ్మూ కాశ్మీర్ కే తన పార్టీని పరిమితం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఆయన పార్టీ ఎవరికి మద్దతిస్తుంది అనుకుంటున్న తరుణంలో తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ నే ఆయన ఎంపిక చేసుకున్నారు. కాశ్మీర్ లో కూడా బీజేపీ విధానాలతోనే ఆయన పోరాటం చేయబోతున్నారని తెలుస్తోంది.

మద్దతులో మతలబు ఉందా..?

ఆజాద్ నుంచి ఊహించని మద్దతు రావడంతో కాంగ్రెస్ వర్గాలు సంతోషంగా ఉన్నాయి. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం గుజరాత్ లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్ అక్కడ ప్రత్యామ్నాయంగా కనపడ్డంలేదు. ఈ దశలో ఆజాద్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆమ్ ఆద్మీ పార్టీని పరోక్షంగా వెనక్కి లాగేందుకే ఆయన కాంగ్రెస్ కి మద్దతుగా మాట్లాడారా అనే విశ్లేషణ కూడా వినపడుతోంది. గతంలో బీజేపీ కూడా ఆజాద్ ని తమవైపు తిప్పుకోవాలనుకుంది. ఆజాద్ ని ప్రధాని మోదీ పొగడ్తల్లో ముంచెత్తడం, ఆజాద్ కూడా మోదీ విధానాలను పరోక్షంగా సమర్థించడం.. వంటి పరిణామాలు జరిగాయి. దీంతో పరోక్షంగా బీజేపీకి మేలు చేసేందుకే ఆజాద్, ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తున్నారనే వాదన వినపడుతోంది. అందుకే ఆయనకు కాంగ్రెస్ పై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చిందని అంటున్నారు.

First Published:  7 Nov 2022 8:06 AM IST
Next Story