ఉత్తరాఖండ్‌లో కూలిన టన్నెల్.. చిక్కుకుపోయిన 36 మంది కార్మికులు
టన్నెల్‌కు సమాంతరంగా డ్రిల్లింగ్ చేసి సొరంగంలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. కార్మికులను బయటకు క్షేమంగా తీసుకొచ్చేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు.
ఉత్తరకాశీలోని ఓ సొరంగంలో హఠాత్తుగా కొండ చరియలు విరిగిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కుప్పకూలడంతో 36 మంది వరకూ అందులో చిక్కుకుపోయారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కొన్ని రోజులుగా యమునోత్రి జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రహదారి నిర్మాణాల్లో భాగంగా సిల్యారా- దండోల్గావ్ వరకు సొరంగం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి టన్నెల్ ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. శిథిలాలు పూర్తిగా కప్పేయడంతో వారికి బయటకు రావడానికి మార్గం మూసుకుపోయింది. ప్రమాద సమాచారం అందుకున్నవెంటనే ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సహాయ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. జిల్లా మెజిస్ట్రేట్, ఎస్‌పీ దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. టన్నల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 200 మీటర్ల వరకూ కుప్పకూలినట్టు అధికారిక సమాచారం.
టన్నెల్‌కు సమాంతరంగా డ్రిల్లింగ్ చేసి సొరంగంలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. కార్మికులను బయటకు క్షేమంగా తీసుకొచ్చేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తయేందుకు రెండు నుంచి మూడు రోజులు పట్టొచ్చని ఉత్తరకాశీ ఎస్పీ అర్పన్ యదువంశీ చెప్పారు. అయితే ఇంతవరకూ మృతుల సమాచారం లేదని, సాధ్యమైనంత త్వరలోనే టన్నల్‌లో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువస్తామని తెలిపారు.
ప్రమాద ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఘటనా స్థలిలోని అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని చెప్పారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు.
♦