Telugu Global
National

యూజీసీ - నెట్‌ పరీక్ష రద్దు.. 9 లక్షల మందికి షాక్‌

యూజీసీ-నెట్‌ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఐతే NTA మాత్రం లీక్‌ వార్తలను ధృవీకరించలేదు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని CBIని ఆదేశించినట్లు స్పష్టం చేసింది.

యూజీసీ - నెట్‌ పరీక్ష రద్దు.. 9 లక్షల మందికి షాక్‌
X

దేశవ్యాప్తంగా NEET ఎగ్జామ్‌ అవకతవకలపై మంటలు చల్లారక ముందే.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మరో సంచలన ప్రకటన చేసింది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC-NET (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌- నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్) పరీక్షను రద్దు చేసింది. ఎగ్జామ్ నిర్వహించిన మరుసటి రోజే రద్దు ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దాదాపు ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 9 లక్షల మంది హాజరయ్యారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీతో పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ అర్హతను నిర్ణయించేందుకు UGC - NET పరీక్షను నిర్వహిస్తారు.

ఐతే అవకతవకలు జరిగినట్లు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ నుంచి సమాచారం రావడంతో UGC-NET పరీక్షను రద్దు చేయాలని NTA నిర్ణయించింది. తిరిగి మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని డెసిషన్ తీసుకుంది. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

యూజీసీ-నెట్‌ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఐతే NTA మాత్రం లీక్‌ వార్తలను ధృవీకరించలేదు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని CBIని ఆదేశించినట్లు స్పష్టం చేసింది. సాధారణంగా ఈ యూజీసీ-నెట్‌ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. జూన్‌, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన NEET ఎగ్జామ్‌పై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం ఇటీవల నిర్వహించిన NEET ఎగ్జామ్‌కు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నిర్ణయించిన తేదీ కంటే 10 రోజుల ముందుగానే అంటే జూన్‌ 4న నీట్ ఫలితాలు కూడా వచ్చాయి. పేపర్‌ లీకేజీ ఆరోపణలతో పాటు 1500 మంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కుల విషయం వివాదానికి దారి తీసింది. దీంతో సుప్రీంకోర్టులోనూ నీట్ ఎగ్జామ్‌పై కేసులు దాఖలయ్యాయి.

First Published:  20 Jun 2024 6:59 AM IST
Next Story