Telugu Global
National

తమిళనాడు మంత్రి వర్గంలోకి స్టాలిన్ వారసుడు..

పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఇప్పటికే ఉదయనిధికి మంచి పేరు వచ్చింది. గత ఎన్నికల్లో ఘన విజయం తర్వాత పార్టీపై ఉదయనిధి పట్టు పెంచుకున్నారు.

తమిళనాడు మంత్రి వర్గంలోకి స్టాలిన్ వారసుడు..
X

డీఎంకేలో మూడో తరం వారసుడు ఉదయనిధి స్టాలిన్ కి త్వరలో అమాత్యయోగం కలగబోతోంది. వాస్తవానికి డీఎంకే అధికారం చేపట్టిన వెంటనే ఉదయనిధికి మంత్రి పదవి ఇస్తారనుకున్నా అది సాధ్యం కాలేదు. తీరా ఇప్పుడు కొడుక్కి తన మంత్రి వర్గంలో చోటివ్వడానికి నిర్ణయించారు సీఎం స్టాలిన్. వచ్చేవారం కేబినెట్ మంత్రిగా ఉదయనిధి ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. ఆయనకు గ్రామీణాభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల శాఖను అప్పగించబోతున్నారు.

సినీ హీరోగా గుర్తింపు..

ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు ఉదయనిధి సినీరంగంలో ప్రవేశించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. స్టార్ కాలేకపోయినా నటుడిగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రం మొత్తం చుట్టేశారు. తాత మరణం తర్వాత తండ్రికి కుడి భుజంగా ఉన్నారు ఉదయనిధి. చెపాక్-తిరువళ్లికేని నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

స్టాలిన్ తెలివైన నిర్ణయం..

మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు, తన కొడుకు ఆదిత్యకు మంత్రి పదవి అప్పగించారు ఉద్దవ్ థాక్రే. అసంతృప్తులకు అనుకోకుండా ఆయనే ఓ అవకాశం ఇచ్చినట్టయింది. కానీ తమిళనాడులో స్టాలిన్ ఆ పని చేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొడుక్కి మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ మాటకొస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ టికెట్ కేటాయింపు సమయంలో కూడా ఉదయనిధికి ఇంటర్వ్యూ జరిగింది. పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఇప్పటికే ఉదయనిధికి మంచి పేరు వచ్చింది. గత ఎన్నికల్లో ఘన విజయం తర్వాత పార్టీపై ఉదయనిధి పట్టు పెంచుకున్నారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ, పార్టీ లీడర్లందరికీ తలలో నాలుకలా మారారు. ఇప్పుడు ఉదయనిధికి మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం చెప్పేవారెవరూ లేరు, పైగా అందరూ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని, కీలక స్థానంలో కూర్చోబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొడుక్కి మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పేందుకు నిర్ణయించారు సీఎం స్టాలిన్.

First Published:  7 Dec 2022 1:28 PM IST
Next Story