కేబినెట్‌లో కుమారుడు ఉదయనిధికి చోటు కల్పించిన సీఎం స్టాలిన్
డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధిని గతంలోనే కేబినెట్‌లోకి తీసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి.
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. స్టాలిన్ వారసుడు ఉదయనిధి ప్రభుత్వంలో భాగం కాబోతున్నారు. తన కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. కేబినెట్ పునర్వవస్థీకరణలో భాగంగా చెన్నైలోని చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయనిధిని మంత్రిని చేయబోతున్నారు. డిసెంబర్ 14న కొత్త మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తున్నది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మంత్రిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. చంద్రబాబు నాయుడు తన కుమారుడిని ముందు ఎమ్మెల్సీని చేసి తర్వాత మంత్రిని చేశారు. కానీ నారా లోకేశ్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోయారు. ఇప్పుడు ఉదయనిధి ఎలాంటి ముద్ర వేస్తారా అనే ఆసక్తి నెలకొన్నది. కరుణానిధి మనుమడిగా తెరంగేట్రం చేసిన ఉదయనిధి పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం నటుడిగానే కాకుండా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్నారు. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చేపాక్-తిరుపల్లికేని నియోజకవర్గం నుంచి దాదాపు 70 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధిని గతంలోనే కేబినెట్‌లోకి తీసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే అప్పటికే ఉన్న సినిమా కమిట్‌మెంట్ల కారణంగా మంత్రివర్గంలో చేరలేదని తెలుస్తున్నది. స్టాలిన్ తాజా మంత్రి వర్గ విస్తరణలో తన కుమారుడికి చోటు కల్పించారు. క్రీడలు, యువజన సర్వీసులు, ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల శాఖను ఆయనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. సచివాలంయలో ఇప్పటికే ఉదయనిధి కోసం ఛాంబర్ సిద్ధం చేశారనే వార్తలు వస్తున్నాయి.
మంత్రిగా బాధ్యతలు చేపట్టనుండటంతో ఉదయనిధి ఇకపై నటనకు దూరమవుతారని తెలుస్తున్నది. అయితే తన సన్నిహితులకు రెడ్ జెయింట్స్ నిర్మాణ సంస్థ బాధ్యతలను అప్పగించారు. ఉదయనిధికి చెందిన ఈ సినిమా నిర్మాణ సంస్థ భారీ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇకపై రాజకీయాల్లో తన వారసుడిని ఫుల్ టైం బిజీగా ఉంచాలని స్టాలిన్ భావిస్తున్నారు. సినిమా నటనకు దూరంగా ఉండి.. రాజకీయాలపైనే ఫోకస్ చేయాలని కూడా దిశానిర్దేశనం చేసినట్లు తెలుస్తున్నది.